తెలంగాణ వీణ , జాతీయం : భారతీయ వెబ్‌సైట్లు, కీలకమైన మౌలిక సదుపాయాలపై సైబర్ దాడి చేయబోతున్నట్టు ప్రపంచంలోని అతిపెద్ద హ్యాకర్ గ్రూపుల్లో ఒకటి ప్రకటించింది. అప్రమత్తమైన కేంద్రమంత్రిత్వశాఖలు, ప్రభుత్వ ఏజెన్సీలు అన్ని వ్యవస్థలను అప్రమత్తం చేశాయి. అనధికారిక యాక్సెస్‌ను నిలువరించే చర్యలు తీసుకోవాలని సూచించాయి. భద్రతను మెరుగుపర్చడంతోపాటు సైబర్ హైజీన్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (ఎస్‌వోపీఎస్)కు కట్టబడి ఉండాలని, హ్యాంకింగ్ నుంచి డేటాను రక్షించుకునేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించాయి.
హ్యాకింగ్ గ్రూప్ ప్రధాన లక్ష్యం ఆరోగ్యం, సైబర్ మౌలిక సదుపాయాలు కావొచ్చని కేంద్ర ఏజెన్సీలు అంచనా వేస్తున్నాయి. పాకిస్థాన్, ఇండోనేషియాకు చెందిన హ్యాకర్ గ్రూపులు తమ టెలిగ్రామ్ చానల్ ద్వారా ఈ నెల 11 ‘సైబర్ పార్టీ’కి దిగుతున్నట్టు ప్రకటించాయి. ఈ టెలిగ్రామ్ చానల్‌లో 4 వేల మందికిపైగా సభ్యత్వం కలిగి ఉన్నారు. ‘సైబర్ పార్టీ’గా పిలిచే ఈ ఈవెంట్ ద్వారా భారతీయ డిజిటల్, మౌలిక సదుపాయాలకు అంతరాయం కలిగించడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి.