తెలంగాణ వీణ,జగిత్యాల : తెలంగాణ సారస్వత పరిషత్తు హైదరాబాదు వారి ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లాకు సంబంధించిన భాష, సాహిత్యం మరియు అనేక అంశాలపై వివిధ వ్యాసకర్తలు రచించిన “జగిత్యాల జిల్లా సమగ్ర స్వరూపం” పుస్తకావిష్కరణ కార్యక్రమం నేడు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల (స్వయం ప్రతిపత్తి) జగిత్యాలలో జరిగింది. ముందుగా టెర్రరిస్టుల అమానుష కాల్పుల వల్ల మృతి చెందిన అమాయక ప్రజలకు నివాళులు అర్పించారు.తదుపరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి మరియు పుస్తకావిష్కర్తగా జగిత్యాల జిల్లా శాసనసభ్యులు డాక్టర్ సంజీవ్ కుమార్ గారు విచ్చేసి మాట్లాడుతూ “తెలంగాణ సారస్వత పరిషత్తుది వజ్ర సంకల్పమని, తెలుగు భాషా, సంస్కృతి మరియు సాహిత్య అభ్యున్నతికి ఏ కార్యక్రమం తలపెట్టినా అది సంపూర్ణం చేసిన ఘనత వారికి ఉందని, తెలంగాణ భాష మరియు సాహిత్యం పునర్నిర్మాణంలో తెలంగాణ సారస్వత పరిషత్తు కృషి ప్రశంసనీయమని, “జగిత్యాల జిల్లా సమగ్ర స్వరూపాన్ని” ఒక పుస్తకంగా తీసుకురావడం, అందునా ఈ పుస్తకాన్ని నా చేతుల మీదుగా ఆవిష్కరించడం సంతోషంగా ఉందన్నారు”
తదుపరి ఇందులో వ్యాసాలను రచించిన వ్యాస రచయితలందరిని, వారిని ఈ పుస్తకంలో భాగస్వాముల్ని చేయడంలో కృషి చేసిన తెలంగాణ సారస్వత పరిషత్తు ప్రధాన కార్యదర్శి డా. జుర్రు చెన్నయ్య గారిని మరియు పరిషత్తు బాధ్యులందరిని అభినందించారు.
కార్యక్రమ అధ్యక్షులు తెలంగాణ సారస్వత పరిషత్తు ప్రధాన కార్యదర్శి డా. జుర్రు చెన్నయ్య మాట్లాడుతూ,
“నిజాం కాలం నుండే తెలుగు భాష, సాహిత్యం మరియు సంస్కృతిని పరిరక్షించడంలో తెలంగాణ సారస్వత పరిషత్తు అనేక కార్యక్రమాలను నిర్వహించడంలో ముందంజలో ఉందని, అందులో భాగంగానే 33 కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత ఆయా జిల్లాల భాష మరియు సాహిత్యాన్ని చారిత్రక నేపథ్యంలో సంగ్రహించే సదుద్దేశంతో వివిధ జిల్లాల సమగ్ర స్వరూపాలను పుస్తక రూపకంగా తీసుకోవచ్చామని, ఈరోజు జగిత్యాల జిల్లా రచయితలు వివిధ రంగాల్లో చేసిన కృషిని ప్రమాణికంగా అక్షరీకరించడంలో భాగంగా “జగిత్యాల జిల్లా సమగ్ర స్వరూపం” పుస్తకాన్ని ఆవిష్కరించుకోవడం ఒక గొప్ప చారిత్రిక సందర్భం అన్నారు. ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని శ్రమ కోర్చి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల జగిత్యాలలో ఏర్పాటు చేసిన కళాశాల ప్రిన్సిపాల్ డా. కె. రామకృష్ణ, తెలుగు విభాగాధిపతి డా. ప్రమోద్ కుమార్ మరియు అధ్యాపకురాలు డా. జి. శ్రీలత తదితరులను అభినందించారు.

ఈ సందర్భంగా కళాశాల ప్రధానాచార్యులు డాక్టర్ కె. రామకృష్ణ గారు మాట్లాడుతూ, “నేడు ఆవిష్కరించుకున్న జగిత్యాల జిల్లా సమగ్ర స్వరూపం రాబోయే తరాలకు జగిత్యాల జిల్లా తెలంగాణ భాష మరియు సాహిత్యానికి ఒక ప్రామాణిక గ్రంథంగా ఉపయోగ పడుతుందని, ఈ పుస్తకాన్ని మా కళాశాలలో ఆవిష్కరించుకునే అవకాశాన్ని కల్పించినందుకు తెలంగాణ సారస్వత పరిషత్తు వారికి కృతజ్ఞతలు తెలియజేశారు”.
అనంతరం జగిత్యాల జిల్లా విద్యాధికారి కె. రాము, జిల్లా సమగ్ర స్వరూపం పుస్తక కోర్ కమిటీ సభ్యులు
కూకట్ల తిరుపతి, బూర్ల చంద్రశేఖర్, తిరునగరి శరత్ చంద్ర, జగిత్యాల మాజీ మున్సిపల్ చైర్మన్ అడువాల జ్యోతి, గిరి నాగభూషణం, కళాశాల సి. పి. డి.సి. కార్యదర్శి డా. జి. శ్రీలత తదితరులు సందేశాన్ని అందించగా జగిత్యాల జిల్లా సమగ్ర స్వరూపం వ్యాస రచయితలని తెలంగాణ సారస్వత పరిషత్తు వారు గౌరవ శాసన సభ్యులు డా. సంజీవ్ కుమార్ గారి చేతుల మీదుగా శాలువా, మెమెంటో మరియు పుస్తకంతో సన్మానించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు జి. చంద్రయ్య, డాక్టర్ వరప్రసాద్, ఎం.ఎ. రహీమ్, శ్రీమతి సంగీత రాణి, డాక్టర్ వాసవి, కుమారి నీర్జ, మల్లికార్జున, జమున, వ్యాస కర్తలు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
Sd/-ప్రిన్సిపాల్,ప్రభుత్వ మహిళా కళాశాల, జగిత్యాల.