తెలంగాణవీణ, యాప్రాల్ : అపార్టుమెంట్లలో అన్ని మౌళిక వసతులు కల్పిస్తామని నమ్మించి మోడీ బిల్డర్స్ మోసం చేశారంటూ హైదరాబాద్ కాప్రా సర్కిల్ పరిధిలోని గుల్ మెహర్ రెసిడెస్సీ వాసులు ఆందోళన బాట పట్టారు. నెలల తరబడి సరైన వసతులు లేక నానా ఇబ్బందులకు గురవుతున్నా బిల్డర్స్ పట్టించుకోవటం లేదని గుల్ మెహర్ రెసిడెన్సీ ఎదుట ప్లాకార్డులు చేత పట్టి ధర్నానిర్వహించారు. గెటెడ్ కమ్యూనిటీ, అన్ని హంగులంటూ ఆర్భటపు ప్రకటనలు చూసి ఇక్కడ ప్లాట్లు కొనుగోలు చేస్తే కష్టాలు కొని తెచ్చుకున్నట్లే ఉందని బాధితులు వాపోతున్నారు. మొత్తం 8 బ్లాకులకు కలిసి 7 బోర్లున్నాయనీ, మంజీరావాటర్, పార్కింగ్ సౌకర్యాలు, లిప్టు వసతి కల్పిస్తామని చెప్పిన బిల్డర్ కేవలం ఒకే బోరుతో అన్ని బ్లాకులకు చాలీచాలని నీటితో, విద్యుత్, పార్కింగ్ సమస్యలతో సతమతమౌతున్నామని చెబుతున్నారు. ఎదేమని ప్రశ్నిస్తే బెధిరింపులకు పాల్పడుతూ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని వాపోతున్నారు. ఎన్నో ఆశలతో సొంతింటి కళ నెరవేర్చుకున్నామనే ఆనందం లేకుండా పోతుందని, రిటైర్మెంట్ తో వచ్చిన డబ్బులతో ఇక్కడ ప్లాటు కొనుగొలు చేసి ఇబ్బందులకు పడుతున్నామంటున్నారు. పార్కింగ్ స్ధలంలో డ్రైనేజీ, వర్షం నీరు నిలవడం, తరచూ విద్యుత్ సమస్యలు, లిప్టు ఎప్పుడు పనిచేస్తుందో తెలియని పరిస్థితుల్లో జీవనం సాగిస్తున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాసీ రకంతో నిర్మాణపు పనులు చేపట్టారనీ భవనం పెచ్చులూడి పోతున్నాయనీ సదరు బిల్డరుకు చెప్పినా పట్టించుకోవటం లేదని ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు సరైన వసతులు కల్పించేలా చర్యలు చేపట్టాలని ఫ్లాటు యజమానులు కోరుతున్నారు. ఇక్కడి రెసిడెన్సీలో 8 బ్లాకుల్లో 340 ప్లాట్లు ఉండగా ప్రస్తుతం 225 ఫ్లాట్లలో యజమానులు నానా ఇక్కట్లకు గురవుతున్నట్లు బాధితులు చెబుతున్నారు.