తెలంగాణవీణ,హైదరాబాద్ : మంచు ఫ్యామిలీ వివాదంలో ట్విస్ట్ చోటుచేసుకుంది. కుటుంబంలో జరిగిన గొడవపై మంచు కుటుంబ సభ్యులు పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ విషయంలో మంచు విష్ణు, మంచు మనోజ్ ల స్టేట్ మెంట్లను పోలీసులు రికార్డు చేశారు. అయితే, ఇప్పటి వరకు మంచు మోహన్ బాబు మాత్రం పోలీసులను కలుసుకోలేదు. ఆయన నుంచి తాము ఎలాంటి స్టేట్ మెంట్ రికార్డు చేయలేదని పహాడీ షరీఫ్ పోలీసులు తెలిపారు.గొడవల నేపథ్యంలో లైసెన్స్ డ్ రివాల్వర్ ను హ్యాండోవర్ చేయాలంటూ పోలీసులు నోటీసులు జారీ చేయగా మంచు విష్ణు తన గన్ ను అప్పగించారు. అయితే, మోహన్ బాబు మాత్రం ఇప్పటికీ గన్ అప్పగించలేదు. స్టేట్ మెంట్ రికార్డు చేయడానికి వచ్చినపుడే గన్ అప్పగిస్తానని మోహన్ బాబు చెప్పినట్లు సమాచారం. అయితే, ప్రస్తుతం మోహన్ బాబు ఎక్కడున్నారనే విషయంపై తమకు ఎలాంటి సమాచారం లేదని పహాడీ షరీఫ్ పోలీసులు స్పష్టం చేశారు. తాను మెడికేషన్ లో ఉన్నానని, రెండు మూడు రోజుల్లో తానే విచారణకు హాజరవుతానని మోహన్ బాబు సమాచారం అందించారని చెప్పారు. మంచు ఫ్యామిలీ ఫాంహౌస్ వద్ద టీవీ రిపోర్టర్ పై దాడికి సంబంధించి మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదైంది. కేసు తీవ్రత దృష్ట్యా పోలీసులు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే అరెస్టు చేసే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని, ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని మోహన్ బాబు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. బెయిల్ పిటిషన్ ను హైకోర్టు కొట్టేసిందనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే మోహన్ బాబు అజ్ఞాతంలోకి వెళ్లారనే ఊహాగానాలు వెలువడుతున్నాయి.