తెలంగాణ వీణ, ములుగు : తెలంగాణలో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఏటూరు నాగారం మండలం ఏజెన్సీ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావోలు మృతిచెందినట్లు తెలుస్తోంది. చల్పాక అటవీ ప్రాంతంలో గ్రేహౌండ్స్ బలగాలు, మావోయిస్టుల మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఎదురు కాల్పుల్లో నర్సంపేట ఏరియా కార్యదర్శి భద్రు మృతిచెందినట్లు సమాచారం. ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రెండు ఏకే-47 రైఫిల్స్‌తోపాటు మరికొన్ని పేలుడు పదార్థాలను సైతం స్వాధీనం చేసుకున్నారు.కాగా, మావోయిస్టులపై గత కొన్ని నెలలుగా కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఈ మేరకు నవంబర్ 22న చత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలో సైతం భారీ ఎన్‌కౌంటర్ నిర్వహించారు. ఆ ఎన్‌కౌంటర్లో 10 మంది మావోలను భద్రతా దళాలు మట్టుబెట్టిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ములుగు జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌ను పోలీసులు ధృవీకరించాల్సి ఉంది.ములుగు జిల్లా వాజేడులో మావోయిస్టులు నవంబర్ 22న ఇద్దరిని కత్తులతో పొడిచి దారుణంగా హతమార్చారు. పోలీసులకు ఇన్‌ఫార్మర్లుగా పని చేస్తున్నారని, ఎన్నిసార్లు హెచ్చరించినా తీరు మార్చుకోకపోవడంతో హత్య చేసినట్లు లేఖ విడుదల చేశారు. మృతులను ఉయిక రమేశ్, ఉయిక అర్జున్‌గా పోలీసులు గుర్తించారు. కాగా, రమేశ్ పంచాయతీ కార్యదర్శిగా ఉద్యోగం చేస్తున్నారు. వీరిని హతమార్చడంతోనే భద్రతా దళాలు కూంబింగ్ చేపట్టి ఏడుగురు మావోయిస్టులను హతమార్చినట్లు తెలుస్తోంది.