తెలంగాణవీణ, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో బట్టల వ్యాపారి కిడ్నాప్ కలకలం రేపింది. కొందరు సైబర్ కేటుగాళ్లు లేడీస్ వాయిస్ తో ఇబ్రహీంపట్నంకు చెందిన ఒక బట్టల వ్యాపారికి కాల్ చేశారు. ఔటర్ రింగ్ రోడ్ మెగా టౌన్ షిప్ వద్ద కమర్షియల్ ప్లాట్ ఉందని అక్కడికి రావాలని తెలిపారు. ఫ్లాట్ తక్కువ ధరకే ఉందని మీకు నచ్చుతుందని నమ్మబలికారు. అంతేకాకుండా ఒక్కసారి మీరు చూస్తే ఆ ఫ్లాట్ వదులుకోలేరని ట్రాప్ చేశారు. దీంతో కేటుగాళ్లు మాటలను నమ్మిన బట్టల వ్యాపారి వెంటనే మెగా టౌన్ షిప్ కి వెళ్ళాడు. కారు దిగిన బట్టల వ్యాపారి అటు చూస్తుండగానే కొందరు వెనుకనుంచి వచ్చి ఒక్కసారిగా తలకు గుడ్డ కట్టి కిడ్నాప్ చేశారు. అతనిని రూమ్ లో బంధించి కోటి రూపాయలు ఇస్తే వదిలేస్తామని తెలిపారు. తలకు తుపాకీ పెట్టి బెదిరింపులకు పాల్పడ్డారు. ఇప్పటికి ఇప్పుడు డబ్బులు అంటే ఎలా అని ప్రశ్నించగా విలువైన డాక్యుమెంట్ల పైన సంతకాలు తీసుకొని బట్టల వ్యాపారిని ఔటర్ రింగ్ రోడ్ వద్ద వదిలేసి పారిపోయారు. బాధితుడు కుటుంబ సభ్యులకు ఫోన్ చేశాడు. అనంతరం ఆదిభట్ల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న దర్యాప్తు చేస్తున్నారు. బట్టల వ్యాపారిని ఎవరు కిడ్నాప్ చేశారు? అసలు లేడీ వాయిస్ తో ఎందుకు కాల్ చేశారు? అనే దానిపై ఆరా తీస్తున్నారు. ఫ్లాట్ కొనుగోలు వుందని పిలిచి విలువైన డాక్యుమెంట్లపై ఎందుకు సంతకాలు చేయించున్నారనే దానిపై ఆరా తీస్తున్నారు.