తెలంగాణవీణ, అల్వాల్ ; మెట్రో రైల్ ఫేస్ 2లో బాగంగా సికింద్రాబాద్ నుంచి మేడ్చ్ కొంపల్లి, అల్వాల్ మీదుగా శామీర్ పేట వైపు మెట్రో రైలు సౌకర్యాలన్ని కల్పించాలని కోరుతూ మేడ్చల్ మెట్రో సాధన సమితి ప్రతినిధులు , మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుతో కలిసి మంగళవారం రాష్ట్ర ఐటీ, ఇండస్ట్రీస్ శాఖ మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్ బాబును కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. నిత్యం రద్ధీగా ఉండే మేడ్చల్ జిల్లా ప్రాంత వాసుల ట్రాఫిక్ సమస్యతో సతమతమౌతున్నారనీ సికింద్రాబాద్ నుంచి అల్వాల్ మీదుగా శామీర్ పేట వరకు , సికింద్రాబాద్ నుంచి కొంపల్లి మీదుగా మేడ్చల్ వైపు మెట్రో రైలు సౌకర్యాన్ని కల్పించేందుకు తగిన చర్యలు చేపట్టాలని కోరారు.
మేడ్చల్, కొంపల్లి, అల్వాల్, శామీర్‌పేట్ వైపు అధిక జనాభా ఉన్న ఉత్తర హైదరాబాద్ వాసులకు మెట్రో రైలు వసతి లేకపోవటం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోందన్నారు. తమకు మెట్రో రైలు సౌకర్యం కల్పించాలని పలు మార్లు విజ్ణప్తులు చేసినప్పటికీ ఫలితం లభించడం లేదన్నారు. గత తొమ్మిది నెలలుగా, బోయిన్ పల్లి, కొంపల్లి, సుచిత్ర, మేడ్చల్‌లలో ధర్నాలు, నిరసనలు, ఆందోళనలు చేపట్టిన సంఘటనలున్నాయని ఇక్కడి నివాసితులు మెట్రో కనెక్టివిటీ లేకపోవడంపై నిరాశ వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు.
మేడ్చల్ మెట్రో సాధన సమితి సభ్యులుగా మేడ్చల్, శామీర్‌పేటలను మెట్రో ఫేజ్-2 ప్రాజెక్టులో చేర్చాలని ఉద్యమిస్తున్నా ఈ సమస్య అపరిష్కృతంగానే ఉందన్నారు. నిత్యం పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యతో ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు నానా ఇక్కట్లు పడుతున్నామనీ వెంటనే జూబ్లీ బస్ స్డాండు నుంచి శామీర్‌పేట్ కు మెట్రో లైన్ వేసి ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలన్నారు. సికింద్రాబాద్ పారడైజ్ నుంచి కొంపల్లి కొంపల్లి, కండ్లకోయ మీదుగా మేడ్చల్‌కు మెట్రో లైన్ వేసి ఇక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలని కోరారు. నిత్యం వేలాధి వాహనాలతో ఇక్కడి రహాదారులు గజిబిజీగా ట్రాఫిక్ వలయంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వెంటనే మెట్రో రైలు సౌకర్యాలన్ని కల్పించాలని కోరారు. ఇక్కడి సమస్యను రాష్ట్ర ముఖ్యమంత్రి , సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి రాబోయే ఫేజ్ 2 మెట్రో విస్తరణ ప్రణాళికలో తగిన ప్రాధాన్యత కల్పించాలని కోరారు. మంత్రిని కలిసిన వారిలో మేడ్చల్ మెట్రో సాధన సమితి ప్రతినిధులు, నార్త్ అల్వాల్ అసోసియేషన్ సభ్యులు గిరిధిర్ రావు, మహేందర్ రెడ్డి, నర్సింగరావు, భూపాల్ రెడ్డితో పాటు పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు.