తెలంగాణవీణ జాతీయం : కర్ణాటకలో సంచలనం సృష్టించిన సినీ నటుడు దర్శన్ తూగుదీప అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో కీలకమైన ఫొటోలు వైరల్‌గా మారాయి. హత్యకు గురికావడానికి ముందు దాడి జరిగిన సమయంలో వాటిని చిత్రీకరించినట్లు తెలుస్తోంది. అప్పటికే దర్శన్, అతడి అనుచరులు అతడిని ఓ లారీ ఎదుట కూర్చోబెట్టి తీవ్రంగా కొట్టినట్లు అర్థమవుతోంది. రేణుకాస్వామి ఒంటిపై చొక్కా లేకుండా ఏడుస్తున్నట్లు కనిపిస్తోంది. మరో ఫొటోలో అతడు పడిపోయిగా ఉండగా.. అతడి చేతిపై తీవ్రమైన కోత గాయం ఉన్నట్లు కనిపిస్తోంది. కొన్ని పత్రికలకు ఈ ఫొటోలు అందడంతో అవి ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఫొటోలను అధికారులు ఛార్జిషీట్‌లో ప్రస్తావించారు. నిందితుల్లో ఒకరి సెల్‌ఫోన్ నుంచి ఈ చిత్రాలను దర్యాప్తు బృందం వెలికితీసినట్లు సమాచారం. వాస్తవానికి ప్రధాన నిందితుడికి వీటిని పంపడానికి కిరాయి గ్యాంగ్‌లోని వారే చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ఈ ఫొటోలు తీసిన మర్నాడు రేణుకాస్వామి మృతదేహాన్ని సుమనహళి వద్ద వరదనీటి కాల్వ సమీపంలో గుర్తించారు. అతడి అవయవాలకు కరెంట్ షాకులు ఇచ్చి చంపినట్లు పోస్ట్‌మార్టం నివేదికలో వెల్లడైన విషయం తెలిసిందే. దాదాపు 231 సాక్ష్యాలతో బెంగళూరు పోలీసులు న్యాయస్థానంలో 3,991 పుటల అభియోగపత్రాన్ని దాఖలు చేశారు. ఫోరెన్సిక్ ప్రయోగశాల నివేదికతో పాటు డీఎన్‌ఏ, మరణోత్తర పరీక్షల నివేదిక, స్థల మహజరు, నిపుణుల సహాయంతో మొబైల్ డేటా, బెంగళూరు, హైదరాబాద్‌లలోని ఫోరెన్సిక్ ప్రయోగశాలల నివేదిక, డిజిటల్ సాక్ష్యాలు అన్నింటితో సమగ్రంగా అభియోగ పత్రాన్ని సిద్ధం చేశారు. ఇక తామే హత్య చేశామని మొదట పోలీసులకు లొంగిపోయిన నిఖిల్ నాయక, కేశవమూర్తి, కార్తిక్‌లకూ ఈ హత్యతో ఎటువంటి సంబంధం లేదని విచారణలో గుర్తించి.. వారిని పోలీసులు ముందే విడుదల చేశారు.ఇక ఇప్పటికే అదుపులోకి తీసుకొన్న 17 మందిలో కొందరు నిందితుల దుస్తులపై రేణుకాస్వామి రక్తపు మరకలు ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఇక హత్య సమయంలో దర్శన్ వాడిన దుస్తులు, బూట్లు, డబ్బు మొత్తం రికవరీ చేసినట్లు అధికారులు తెలిపారు.