-సామాన్యుడి గొంతుకగా సోషల్ మీడియా
-ఆన్ లైన్ మీడియాకు చట్టబద్దత కల్పించాలి
-రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తల డిమాండ్.
తెలంగాణవీణ , హైదరాబాద్ : భావ ప్రకటన స్వేచ్ఛను ఎవరూ హరించలేరని, సామాన్యుల గొంతుకగా ఉన్న ఆన్ లైన్, సామాజిక మాధ్యమంపై పాలకుల అణచివేత సరైంది కాదని పలువురు వక్తలు అన్నారు. సమాజానికి సోషల్ మీడియా అవసరం ఎంతో ఉందని వారు అభిప్రాయ పడ్డారు. తెలంగాణ యూనియన్ ఆఫ్ ఆన్ లైన్ జర్నలిస్ట్స్ (టీయూఓడబ్ల్యూజే) ఆధ్వర్యంలో ”ఆన్ లైన్ జర్నలిజం-భవిష్యత్తు-
సవాళ్ళు”అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. యూనియన్ అధ్యక్షుడు బుర్ర శ్రీనివాస్ అధ్యక్షతన హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగిన ఈ సమావేశంలో మాజీ డీజీపీ పూర్ణచంద్రరావు, ప్రొఫెసర్ ఖాసీం, సీనియర్ పాత్రికేయులు,కేంద్ర సమాచార కమీషన్ మాజీ ఛైర్మన్ మాడభూషి శ్రీధర్, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య, సీనియర్ జర్నలిస్టు తెలంగాణ విఠల్, తెలంగాణ జర్నలిస్ట్స్ ఫోరం అధ్యక్షులు పల్లె రవి కుమార్, ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ కార్యదర్శి పులిపలుపుల ఆనందం, టీయూడబ్ల్యూ జే నాయకులు ఇస్మాయిల్, రమణ తదితరులు పాల్గొని ప్రసంగించారు. సోషల్ మీడియా దేశవ్యాప్తంగా విస్తరించిందని, దేశ భవిష్యత్తు సోషల్ మీడియా చేతిలో ఉందని వక్తలు అభిప్రాయపడ్డారు.
డిజిటల్ మీడియా వేదికగా జర్నలిస్టులు పని చేస్తున్నారని, కొత్త మీడియాను ప్రోత్సాహించాలి గానీ, అణగదొక్కే ప్రయత్నాలు ప్రభుత్వాలు చేయకూడదని పలువురు ప్రముఖులు సీనియర్ జర్నలిస్టులు కోరారు. సోషల్ మీడియా లేకపోతే సమాజం అందకారమవుతుందని, పాలకుల అవినీతి, అక్రమాలకు అడ్డుకట్ట ఉండదని అన్నారు. ఆన్ లైన్ మీడియాను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించి చట్టబద్దత కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో సీనియర్ జర్నలిస్టులు ప్రేమ మాలిని, కోనేరు రూపావని, యోగి, భద్ర, ముద్దం స్వామి తదితరులు పాల్గొన్నారు.