తెలంగాణవీణ సినిమా :కష్టాల్లో ఉన్నవారికి సాయం అందించడానికి ఎప్పుడూ ముందుంటారు నటుడు ఎన్టీఆర్ తాజాగా ఆయన మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి రూ.కోటి విరాళంగా ఇచ్చారు. ఈమేరకు తన ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు.‘రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల కలిగిన వరద బీభత్సం నన్ను ఎంతగానో కలచివేసింది. అతి త్వరగా ఈ విపత్తు నుంచి తెలుగు ప్రజలంతా కోలుకోవాలని నేను దేవుడిని ప్రార్థిస్తున్నాను. వరద విపత్తు నుంచి ఉపశమనం కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకొనే చర్యలకు సహాయపడాలని నావంతుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రుల సహాయనిధికి చెరొక రూ.50 లక్షలు విరాళంగా ప్రకటిస్తున్నాను’ అని తెలిపారు.తెలుగు రాష్ట్రాలకు రూ.10 లక్షల సాయం: విష్వక్‌సేన్ తెలుగు రాష్ట్రాల్లోని ప్రజల కోసం విష్వక్‌సేన్ తనవంతు సాయం చేశారు. రూ.10 లక్షలు విరాళంగా ప్రకటించారు. ‘ఈ విపత్తు సమయంలో, రాష్ట్రంలో వరద సహాయక చర్యలకు మద్దతుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీఎంల సహాయనిధికి రూ.10 లక్షలు విరాళంగా ఇస్తున్నాను. వరదల వల్ల నష్టపోయిన వారి బాధలను తగ్గించే దిశగా ఈ సహకారం ఒక చిన్న అడుగు’ అని పోస్ట్ పెట్టారు.ఇటీవల కురిసిన వర్షాలకు రెండు తెలుగు రాష్ట్రాల్లో వరద బీభత్సం సృష్టిస్తోంది. దీంతో సినీప్రముఖులు బాధితులకు అండగా నిలుస్తున్నారు. తాజాగా ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ.25 లక్షల విరాళం ఇస్తున్నట్టు వైజయంతి మూవీస్ ప్రకటించింది. అలాగే, ‘ఆయ్’ చిత్ర బృందం సైతం వరద బాధితులకు ఆర్థికసాయం చేయాలని నిర్ణయించుకుంది. సోమవారం నుంచి వారాంతం వరకూ ఆ సినిమాకి రానున్న వసూళ్లలో నిర్మాత షేర్‌లో 25 శాతాన్ని జనసేన పార్టీ తరఫున విరాళంగా అందజేయనున్నట్లు ప్రకటించింది.