తెలంగాణవీణ ఏపీ బ్యూరో : వైకాపా నేత, బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లో ఆయన్ను అరెస్ట్ చేసి గుంటూరు జిల్లా మంగళగిరి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అమరావతిలోని తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ఆయనతో పాటు మరికొందరు వైకాపా నేతలపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని వారు దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. దీంతో సురేశ్‌ను అరెస్టు చేసేందుకు బుధవారం ఉద్దండరాయునిపాలెంలోని ఆయన ఇంటికి తుళ్లూరు పోలీసులు వెళ్లారు. దాదాపు 15 నిమిషాలు అక్కడే వేచి చూశారు. అక్కడ లేరని తెలియడంతో వెనుదిరిగారు. అరెస్టు భయంతో సురేశ్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయి సెల్‌ఫోన్ స్విచాఫ్ చేశారు. సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా బుధవారం ఉదయం నుంచి ఆయన ఎక్కడున్నారో పోలీసులు విచారణ చేపట్టారు. హైదరాబాద్ వెళ్లి అక్కడి నుంచి పారిపోయేందుకు యత్నిస్తున్నారనే సమాచారంతో ఏపీ పోలీసులు అక్కడికి వెళ్లారు. పక్కా సమాచారంతో అక్కడ ఆయన్ను అరెస్ట్ చేశారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న వైకాపా నేతలు లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్, తలశిల రఘురామ్, నందిగం సురేష్ తదితరుల కోసం గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల పోలీసులతో కలిపి 12 బృందాలను ఏర్పాటుచేశారు. మరోవైపు ఇదే కేసులో నిందితుడిగా ఉన్న విజయవాడ డిప్యూటీ మేయర్ శైలజ భర్త శ్రీనివాసరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఇతర నిందితుల కోసం గాలింపు కొనసాగుతోంది.