తెలంగాణ వీణ :తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ అయిందనే వార్త దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ అంశం దుమారం రేపుతోంది. ఈ నేపథ్యంలో లడ్డూపై సినీ హీరో కార్తీ చేసిన వ్యాఖ్యలపై ఏపీ డిప్యూటీ సీఎం తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సినిమా వాళ్లు సనాతన ధర్మానికి మద్దతుగా ఉండాలని… లేకపోతే నోరు మూసుకుని ఉండాలని పవన్ అన్నారు. ఈ క్రమంలో పవన్ కు కార్తి క్షమాపణలు చెప్పారు. ‘పవన్ సార్… అనుకోకుండా ఏదైనా అపార్థం జరిగి ఉంటే క్షమించాలని మీపై ఉన్న ఎంతో గౌరవంతో కోరుతున్నా’ అని కార్తి చెప్పారు. వేంకటేశ్వరస్వామి భక్తుడిగా తాను ఎప్పుడూ మన సాంప్రదాయాలను గౌరవిస్తానని అన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు.కార్తి తాజా చిత్రం ‘సత్యం సుందరం’ సినిమా ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్ లో జరిగింది. ఈవెంట్ లో లేడీ యాంకర్ మాట్లాడుతూ… లడ్డూ కావాలా నాయనా అని కార్తీని అడిగింది. దీనికి సమాధానంగా… ఇప్పుడు లడ్డూ గురించి మాట్లాడొద్దు… ఇది చాలా సున్నితమైన అంశమని నవ్వుతూ చెప్పారు. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ క్రమంలోనే పవన్ సీరియస్ గా రెస్పాండ్ అయ్యారు.