తెలంగాణవీణ జాతీయం : సామాజిక మాధ్యమం ఎక్స్ అల్గారిథం ఎలా పనిచేస్తుందో దాని యజమాని ఎలాన్ మస్క్ తాజాగా ఓ పోస్టులో వెల్లడించారు. ఆయనకు ఎదురైన ఓ ప్రశ్నకు సమాధానంగా ఈవిషయం చెప్పారు. ‘‘మీరు ఏదైనా కంటెంట్‌తో ఇంటరాక్ట్ అయితే (లైక్, కామెంట్, షేర్ చేస్తే) అది నేరుగా ఎక్స్ అల్గారిథమ్‌ను ప్రభావితం చేస్తుంది. అలాంటి కంటెంట్‌ను మీరు చూడాలనుకొంటున్నారని అది భావిస్తుంది. మీ మిత్రుల పోస్టులను షేర్ చేయడం అల్గారిథమ్‌కు బలమైన సంకేతాలను పంపుతుంది. దానిని మీరు మరింత చూడాలనుకుంటున్నారని భావిస్తుంది. ఎందుకంటే దానిని ఫార్వర్డ్ చేయడానికి చాలా శ్రమిస్తుంది. ఒకవేళ మీరు కోపంతో మీ ఫ్రెండ్ కంటెంట్‌ను ఫార్వర్డ్ చేస్తే మాత్రం దానిని గుర్తించేంత స్మార్ట్‌గా ఇంకా మేం మారలేదు’’ అని మస్క్ వెల్లడించారు. వాక్‌స్వేచ్ఛకు మద్దతుగా ఉండే కంటెంట్ అంటే తనకు చాలా ఇష్టమని మస్క్ పేర్కొన్నారు. ఎక్స్ సుదీర్ఘకాలం ఉండాలని కోరుకుంటున్నాను. అవసరమైతే ఈవిషయంలో బ్రెజిల్ నియంతతో కేజ్‌ఫైట్ చేయడానికి కూడా సిద్ధమన్నారు. బ్రెజిల్‌లో సామాజిక మాధ్యమం ఎక్స్ సేవలు నిలిచిపోయాయి. ఆ దేశ సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఆదేశాల మేరకు టెలికామ్ విభాగం ఈ చర్యలు తీసుకొంది. దీంతో ఇక్కడి ప్రజలకు ఎక్స్‌లోకి లాగిన్ అవడం సాధ్యం కావడం లేదు. బ్రెజిల్‌లో ఎక్స్ ఎటువంటి న్యాయ ప్రతినిధిని నియమించలేదు. దీంతో అక్కడి సుప్రీంకోర్టు న్యాయమూర్తి అలెగ్జాండర్ డె మోరాసే తక్షణమే ఎక్స్‌ను 24 గంటల్లో ఆపేయమని ఇటీవల ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ వివాదం మొత్తం ఏప్రిల్‌లో మొదలైంది. దేశంలో తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్న పలు ఎక్స్ ఖాతాలను తొలగించాలని న్యాయస్థానం ఆదేశించడం వివాదానికి బీజం వేసింది. మరోవైపు టెక్ దిగ్గజాలైన యాపిల్, గూగుల్‌కు న్యాయమూర్తి మోరాసే ఐదు రోజుల గడువు విధించారు. ఈలోపే వాటి ఆండ్రాయిడ్, ఐవోఎస్ అప్లికేషన్ల నుంచి ఎక్స్‌ను తొలగించాలని సూచించారు. ఇక బ్రెజిల్‌లో ఎక్స్‌పై నిషేధంలో చట్టబద్ధతను ఆ దేశ సుప్రీంకోర్టులోని ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన అత్యున్నత బెంచ్ సోమవారం సమీక్షించనుంది. దీనిపై కీలకమైన రూలింగ్ వెలువడే అవకాశం ఉంది. :