తెలంగాణవీణ ఖమ్మం : ఆక్రమణల వల్లే ఖమ్మంలో భారీగా వరదలు వచ్చాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మున్నేరు రిటైనింగ్ వాల్ ఎత్తు పెంపుపై ఇంజినీర్లతో చర్చిస్తామని చెప్పారు. సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్స్ ద్వారా గుర్తించి ఆక్రమణలు తొలగిస్తామని వెల్లడించారు. 75 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా 42 సెం.మీ వర్షం పడిందన్నారు. ప్రభుత్వ ముందుచూపు వల్లే ప్రాణ నష్టం తగ్గిందని వివరించారు. ఖమ్మంలో మీడియా ప్రతినిధులతో సీఎం చిట్‌చాట్ నిర్వహించారు. వరదలపై మాజీ మంత్రి హరీశ్ రావు ఇష్టారీతిన మాట్లాడుతున్నారని రేవంత్ మండిపడ్డారు. భారాస నేత పువ్వాడ ఆక్రమణలపై హరీశ్ స్పందించాలని వ్యాఖ్యానించారు. ఆక్రమించిన స్థలంలో పువ్వాడ ఆస్పత్రి కట్టారని.. వాటిని తొలగించాలని ఆయనకు హరీశ్ చెప్పాలని సూచించారు. వరద సాయం కోసం కేంద్రానికి లేఖ రాసినట్లు సీఎం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల సాయం ప్రకటించినట్లు చెప్పారు.