తెలంగాణవేణ సినిమా : ప్రజలకు ఈరోజుల్లో పవన్‌కల్యాణ్ లాంటి నాయకుడు కావాలని చిరంజీవి అన్నారు. నేడు పవన్ పుట్టినరోజు సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఓ ప్రత్యేక ఫొటోను షేర్ చేశారు. ‘‘కల్యాణ్ బాబు.. ప్రతీ సంవత్సరం నీకు పుట్టినరోజు వస్తుంటుంది. కానీ, ఈ పుట్టినరోజు మరీ ప్రత్యేకం. ఆంధ్ర ప్రజానీకానికి కావలసిన సమయంలో కావాల్సిన నాయకుడు వాళ్ల జీవితంలో పెను మార్పులు తీసుకురావడానికి వాళ్ల ఇంటి పెద్ద బిడ్డగా వచ్చాడు. రాజకీయాల్లో నీతి, నిజాయితీ, నిలకడ, నిబద్ధత కలిగిన ఒక నాయకుడిగా నిన్ను వాళ్ల జీవితాల్లోకి ఆహ్వానించారు. గుండెల్లో స్థానం ఇచ్చారు. అది సుస్థిరం. ఈ రోజుల్లో నీలాంటి నాయకుడు కావాలి, రావాలి. అద్భుతాలు జరగాలి. అది నువ్వు మాత్రమే చేయగలవు, చేస్తావనే నమ్మకం నాతో పాటు ఆంధ్ర ప్రజలందరికీ ఉంది. పుట్టిన రోజు శుభాకాంక్షలు. దీర్ఘాయుష్మాన్ భవ!’’ అని చిరంజీవి తన పోస్ట్‌లో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా పవన్‌కల్యాణ్‌కు విషెస్ తెలుపుతూ సోషల్‌మీడియాలో పోస్ట్ పెట్టారు. ‘‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌కు జన్మదిన శుభాకాంక్షలు. ప్రజా జీవితంలో నిబద్ధతతో ఉండే నాయకుడిగా మరెన్నో మైలురాళ్లు దాటాలని ఆకాంక్షిస్తున్నా. చలనచిత్ర సీమలో తిరుగులేని కథానాయకుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆయన రానున్న రోజుల్లో మరిన్ని అద్భుతాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, భగవంతుడి ఆశీస్సులు మెండుగా ఉండాలని ఆశిస్తున్నా’’ అని పేర్కొన్నారు.