తెలంగాణవీణ సినిమా: 35 చిన్న కథ కాదు; నటీనటులు: నివేదా థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్ ఆర్, గౌతమి, భాగ్యరాజ్, కృష్ణ తేజ, అభయ్, అనన్య, తదితరులు; సంగీతం: వివేక్ సాగర్; సమర్పణ: రానా దగ్గుబాటి; నిర్మాతలు: సృజన్, సిద్ధార్థ్; రచన, దర్శకత్వం: నందకిషోర్ ఇమాని; విడుదల తేదీ: 6-09-2024: ఈ నెలాఖరున భారీ బడ్జెట్‌తో విడుదలయ్యే ‘దేవర’ సినిమా వరకూ పరిమిత వ్యయంతో రూపొందిన సినిమాలదే జోరు. కథా బలం ఉన్న సినిమాలు పదుల సంఖ్యలో వరస కట్టనున్నాయి. ఇందులోభాగంగా మొదట ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రమే ‘35 చిన్న కథ కాదు’ . నివేదా థామస్, విశ్వదేవ్, ప్రియదర్శి తదితరులు నటించడం.. ప్రముఖ నిర్మాణసంస్థ సురేష్ ప్రొడక్షన్స్ నుంచి దగ్గుబాటి రానా సమర్పణలో ఈ సినిమా విడుదలవడంతో సినిమాపై ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఆసక్తి ఏర్పడింది. ప్రచార చిత్రాలూ ఓ కొత్త రకమైన సినిమా అనే భరోసానిచ్చాయి. రేపు విడుదల కానున్న నేపథ్యంలో ప్రెస్‌కు ప్రత్యేకంగా ప్రీమియర్ షో వేశారు. మరీ చిత్రం ఎలా ఉందో తెలుసుకునే ముందు కథేమిటో చూద్దాం.కథేంటంటే: ప్రసాద్ (విశ్వదేవ్ రాచకొండ) ఓ బస్ కండక్టర్. ఆయన భార్య సరస్వతి (నివేదా థామస్). తన భర్త, పిల్లలు అరుణ్, వరుణ్.. ఈ ముగ్గురే ప్రపంచంగా బతుకుతున్న ఓ గృహిణి ఆమె. తిరుపతిలో వీళ్ల నివాసం. చిన్నోడు పర్వాలేదు కానీ, పెద్దోడు అరుణ్‌కి మాత్రం లెక్కల పాఠాలు ఓ పట్టాన అర్థం కావు. సున్నాకి ఏమీ విలువ లేనప్పుడు దానిపక్కన ఒకటి వచ్చి నిలబడితే పది ఎందుకవుతుందని అడుగుతుంటాడు. తను అడిగే ఇలాంటి కొన్ని ప్రశ్నలకు టీచర్ల దగ్గర కూడా సమాధానాలు దొరకవు. దాంతో లెక్కల మాస్టారు చాణక్య (ప్రియదర్శి) ఫండమెంటల్స్‌ను ప్రశ్నిస్తే మిగిలేది జీరోనే అంటూ అరుణ్‌కి జీరో అని పేరు పెట్టి చివరి బెంచీకి పంపిస్తాడు. ఆరోతరగతిలో ఫెయిల్ కూడా చేస్తాడు. దీంతో తన తమ్ముడి క్లాస్‌లో కూర్చోవాల్సి వస్తుంది. ఈసారి అరుణ్ స్కూల్‌లో ఉండాలంటే లెక్కల్లో కనీసం 35 మార్కులు సాధించాల్సిందే. ఆ పరిస్థితుల్లో జీరో అరుణ్.. క్లాస్‌లో హీరో ఎలా అయ్యాడు? తన కొడుక్కి లెక్కల పాఠాలు అర్థం కావాలని టెన్త్ ఫెయిల్ అయిన తల్లి సరస్వతి ఏం చేసింది? అరుణ్ అసలు 35 మార్కులు తెచ్చుకున్నాడా లేదా? అనేది మిగతా కథ. ఎలా ఉందంటే: ఇది లెక్కల కథ, పిల్లల కథ మాత్రమే కాదు.. అమ్మానాన్నల కథ కూడా. చదువుకోవడం అంటే నేర్చుకోవడం అని, ప్రశ్నించడం ఆగిపోతే నేర్చుకోవడమే ఆగిపోతుందని చెబుతుంది. సహజంగానే పిల్లల మదిలో ప్రశ్నలే మెదులుతుంటాయి. వాటికి కొన్నిసార్లు సమాధానాలు కూడా అంతుచిక్కవు. కానీ తర్కంతో, పిల్లలకు అర్థమయ్యేలా నివృత్తి చేసినప్పుడే వాళ్లు నేర్చుకుంటారు. అందుకుతగ్గట్టుగానే మన విద్యా విధానం సాగాలని చెప్పకనే చెప్పే విలువైన చిత్రమిది. అలాగని ఇది విద్యాబోధన చుట్టూనే సాగదు. భావోద్వేగాలతో కూడిన అమ్మానాన్నల కథ కూడా ఇందులో ఉంది. భార్యాభర్తలు ఒకరినొకరు ఎలా అర్థం చేసుకోవాలో ప్రథమార్ధంలో ప్రసాద్, సరస్వతిల మధ్య సాగే సన్నివేశాలతో ఎంతో అందంగా చూపించారు. భర్త మనసుని గెలిస్తే చాలనుకొని టెన్త్ ఫెయిల్‌తోనే ఆగిపోయిన ఓ గృహిణి… ఏ పరిస్థితుల్లో మళ్లీ పుస్తకాలు పట్టాల్సి వచ్చిందనేది ఇందులో కీలకం. తిరుపతి నేపథ్యం, భక్తి కోణం ఈ కథలోనే ఇమిడి వుంది. అది ప్రేక్షకుడికి ఓ కొత్త అనుభూతిని పంచుతుంది.ఆరంభ సన్నివేశాలు నెమ్మదిగా సాగుతూ కథా ప్రపంచంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాయి. చాణక్య మాస్టార్‌ని అరుణ్ ప్రశ్నించడం మొదలయ్యాక కథలో వేగం పెరుగుతుంది. లెక్కల టీచర్లు, పిల్లలకు మధ్య వాతావరణం, పిల్లల మనస్తత్వాలు, క్లాస్ రూమ్‌లో స్నేహాలు, వాళ్లు ఒకరికొకరు దూరమైనప్పుడు పసి మనసులపై పడే ప్రభావం.. తదితర సన్నివేశాల్ని హృదయాల్ని హత్తుకునేలా మలిచారు దర్శకుడు. ప్రశ్నలతో కథని మొదలుపెట్టిన దర్శకుడు, ద్వితీయార్ధంలో అమ్మ పాత్ర నుంచి వాటికి సమాధానాల్ని చెప్పించిన విధానం సినిమాకి హైలైట్. పిల్లలకు పాఠాలు ఎలా చెబితే బోధపడతాయో ఆ సన్నివేశాలు చాటి చెబుతాయి. పతాక సన్నివేశాల్లో తండ్రి మార్కులు చదివినప్పుడు అరుణ్ అద్దంపై నీళ్లు చల్లే సన్నివేశాలు భావోద్వేగాల్ని పంచుతాయి. మనకు అలవాటైన కమర్షియల్ హంగులు ఇందులో లేకపోయినా, చెప్పాల్సిన కథ ఇది. సినిమాలో కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. అక్కడక్కడా సన్నివేశాలు నెమ్మదిగా సాగుతాయి. కథనంలో మెరుపులు లేవు. హాస్యం, భావోద్వేగాలు ఉన్నప్పటికీ వాటి మోతాదు సరిపోలేదు. సాంకేతికంగానూ లోపాలు కనిపిస్తాయి. కొన్ని పాత్రలు పలికే సంభాషణలు స్పష్టంగా వినిపించవు. కొత్త యాసని ఎంచుకున్నప్పుడు అవి ప్రేక్షకులకు స్పష్టంగా వినిపించేలా జాగ్రత్తలు తీసుకోవాలి.ఎవరెలా చేశారంటే: నివేదా, విశ్వదేవ్, ప్రియదర్శి మొదలుకుని తెరపై కనిపించిన చిన్నారుల వరకూ నటన పరంగా ఎవ్వరూ తక్కువ చేయలేదు. పాత్రల్లో ఇమిడిపోయారు. ముఖ్యంగా నివేదా ఇద్దరు పిల్లల తల్లిగా, భార్యగా, గురువుగా చక్కటి అభినయం ప్రదర్శించింది. చాలా చోట్ల కళ్లతోనే భావాల్ని పలికించింది. చాణక్య టీచర్‌తో తన పిల్లలకు ఆ పేర్లు ఎందుకు పెట్టిందో చెప్పే సన్నివేశాలు, భర్తతో గొడవైనప్పుడు ఆమె నటించిన తీరు చిత్రానికి హైలైట్. పిల్లలతో నేను బాగుండకపోయినా, పిల్లలు బాగుండాలని కోరుకునే చాణక్య మాస్టార్ పాత్రని మలిచిన విధానం, అందులో ప్రియదర్శి ఒదిగిపోయిన విధానం చాలా బాగుంది. విశ్వదేవ్ భర్తగా, తండ్రిగా చాలా బాగా నటించాడు. భాగ్యరాజ్, కృష్ణతేజ తదితరులు కీలకమైన పాత్రల్లో కనిపిస్తారు. చిన్నారులంతా వాళ్ల పాత్రల్లో ఒదిగిపోయారు. ముఖ్యంగా అరుణ్ ‘తారే జమీన్ పర్’ సినిమాలో దర్శీల్‌ని గుర్తు చేశాడు.
సాంకేతిక విభాగాల్లో సంగీతం, కెమెరా విభాగాలు చక్కటి పనితీరుని కనబరిచాయి. దర్శకుడి పనితనం మెప్పిస్తుంది. ఓ కొత్త కోణాన్ని స్పృశించిన తీరు, కథని నడిపించిన విధానం మెప్పిస్తుంది. మాటలు ఆకట్టుకుంటాయి. ఎన్నున్నా సరే, ఓడిపోతామనే భయం ఉంటే ఏమీ లేకుండా చేస్తుంది, గెలుపు అనే ప్లస్ వైపు అడుగులు వేస్తున్న ప్రతిఒక్కరికీ ఎదురయ్యే ఓ మజిలీ జీరో, ఎదగాలనుకున్నప్పుడు తుంచాలి కొమ్మనైనా, కొడుకునైనా.. తదితర సంభాషణలు సినిమాకి బలాన్నిచ్చాయి. ఎంతో అభిరుచి ఉంటే తప్ప నిర్మాతలు ఇలాంటి కథల్ని నమ్మలేరు. ఓ మంచి సినిమాగా దర్శక నిర్మాతలకి, నటులకు, సాంకేతిక బృందానికీ గౌరవాన్ని తీసుకొచ్చే చిత్రమిది.
బలాలు
+కథ, నేపథ్యం
+నటీనటులు, సంభాషణలు
+భావోద్వేగాలు
బలహీనతలు
-నెమ్మదిగా సాగే సన్నివేశాలు
చివరిగా: చిన్న కథ కాదు… ఓ మంచి కథ
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది.ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!