తెలంగాణవీణ ఏపీ బ్యూరో : కృష్ణా నదికి వచ్చిన వరద కంటే, బుడమేరు పొంగడం వల్లే విజయవాడలో ఎక్కువ నష్టం జరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ‘బుడమేరు కాల్వ కట్టకు గండ్లు పడినా గత ప్రభుత్వం పూడ్చలేదు. 2019 తర్వాత విచ్చలవిడిగా పెరిగిన ఆక్రమణలు మరో కారణం. పోలవరం కుడి ప్రధాన కాల్వ గట్లనూ తవ్వేసి మట్టి కొల్లగొట్టారు. ఒక వ్యక్తి దుర్మార్గానికి విజయవాడ నగరమే గజగజలాడింది. అమాయకులు బాధపడే పరిస్థితి వచ్చింద’ని దుయ్యబట్టారు. విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్‌లో బుధవారం చంద్రబాబు విలేకరులతో మాట్లాడారు.‘బుడమేరుకు గండ్లు పడితే, గత ఐదేళ్లు అధికారంలో ఉన్నవారు ఏం చేశారు? పైగా వాగును కబ్జా చేసి ప్రజల్ని ముంచేశారు. తప్పుడు పనులు చేసి మాపై బురదజల్లే నీచానికి పాల్పడుతున్నారు. బాధ్యత లేకుండా, రాక్షసంగా వ్యవహరిస్తున్నారు. సిగ్గుంటే క్షమాపణ చెప్పండి’ అని డిమాండ్ చేశారు. ఒక రాజకీయ పార్టీ ముసుగులో నేరస్థులు చేసే అరాచకాలు, దౌర్జన్యాలను ఉపేక్షించబోమని హెచ్చరించారు. బుడమేరు నీటిని కొల్లేరుకు/ కృష్ణానదికి పంపడంపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ‘11 వేల క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యం గల బుడమేరుకు, 70 వేల క్యూసెక్కుల వరద వచ్చింది. ఇది కొల్లేరు సరస్సులోకి చేరుకునే మార్గాల్లో ఎక్కడికక్కడ నిర్మాణాలు కట్టి వాగును పూడ్చేశారు. బుడమేరు ఆధునికీకరణకు 2014 తర్వాత తెదేపా ప్రభుత్వ హయాంలో రూ. 500 కోట్లు కేటాయించాం. వైకాపా ప్రభుత్వం వచ్చాక వాటిని ఖర్చు చేయకుండా ఆపేసింద’ని బాబు ధ్వజమెత్తారు. ‘బుడమేరు పరీవాహకంలో మంగళవారం రాత్రి కురిసిన వర్షానికి 5వేల నుంచి 7వేల క్యూసెక్కుల వరద మూణ్నాలుగు గంటలపాటు రావొచ్చని అంచనా వేశాం. గండ్ల పూడ్చివేత పనులను మంత్రులు లోకేశ్, రామానాయుడు పర్యవేక్షిస్తున్నార’ని సీఎం వివరించారు.వారిలా ప్యాలెస్‌లు కట్టుకుని ఉండడం లేదు నేను ‘అమరావతి ఎడారి అంటున్నారు. మునిగిపోయిందంటూ దుష్ప్రచారం చేస్తున్నారు. పత్రికలో (సాక్షి) ఫొటోలు వేస్తున్నారు. అదొక పత్రికా? వైకాపా రాక్షసమూక ప్రజల్ని భయభ్రాంతుల్ని చేస్తోంది. ఇలాంటి వాళ్లను సంఘ బహిష్కరణ చేయాలి’ అని చంద్రబాబు విరుచుకుపడ్డారు. ‘నా ఇల్లు మునుగుతుందని బుడమేరు ద్వారా విజయవాడను ముంచడానికి గేట్లు ఎత్తామట. నా ఇంట్లోకీ నీళ్లు వచ్చాయి.. పోయాయి. ఇల్లు కూలిపోతుందని పారిపోయానంట! ఈ మాట అనడానికి బుద్ధి, జ్ఞానం ఉన్నాయా? ఆ ఇల్లు నాది కాదు. అద్దెకు ఉంటున్నా. దాన్నీ ఓర్వలేకపోతున్నారు. వారి లాగా ప్యాలెస్‌లు కట్టుకుని నేనుండటం లేదు’ అని చంద్రబాబు వివరించారు. ‘11.90 లక్షల క్యూసెక్కుల ప్రవాహంతో డిజైన్ చేసిన ప్రకాశం బ్యారేజీకి 11.43 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. మరో 40 వేల క్యూసెక్కులు వచ్చి ఉంటే ప్రమాదకరంగా ఉండేది. ఈ వరదకే భవానీపురంలో కొంత మునిగింది. ఎగువన ఇబ్రహీంపట్నం నుంచి మూలపేట వరకు హైవేపైకి నీరు చేరింది. పక్క గ్రామాలు మునిగాయి’ అని చంద్రబాబు గుర్తుచేశారు.నేను పనిలేక వరదల్లో తిరుగుతున్నానా?‘బుడమేరుకు గండ్లు పెట్టి, ఇంతటి పరిస్థితికి కారణమైన వ్యక్తి జగన్. అధికారంలో ఉన్నప్పుడు రెడ్ కార్పెట్‌పై వెళ్లి నష్టాన్ని పరిశీలించారు. ఇప్పుడు నేను బురదలో తిరుగుతున్నాను కాబట్టి, ఆయనా దిగారు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజమెత్తారు. ‘నాకు పనిలేక వరద ప్రాంతాల్లో తిరుగుతున్నానట. జగన్‌కేమో ఎక్కువ పని ఉంది కాబట్టి లండన్ వెళ్తున్నారా?’ అని ప్రశ్నించారు. ‘నేను బురదలో దిగకపోతే అధికారులు దిగుతారా? వారిని వెళ్లమనే హక్కు నాకుంటుందా? అప్పుడు ప్రజల పరిస్థితేంటి? వారి దగ్గరకు వెళ్లేదెవరు?’ అని పేర్కొన్నారు. ‘ముఖ్యమంత్రి పనిచేయాల్సిన అవసరం లేదని, పని చేయకుంటే అన్నీ అయిపోతాయని సమర్థించుకుంటున్నారు. ఆయనో సైకో. తాను చెప్పేదే సరైందని నమ్మిస్తారు. జనానికి ముద్దులు పెట్టి, ఇంట్లోకి వెళ్లాక పదిసార్లు చేతులు కడుక్కునే జగన్ లాంటి వ్యక్తులు రాజకీయాలకు అనర్హులు’ అని చంద్రబాబు దుయ్యబట్టారు. వాగుకు, నదికీ తేడా తెలియని జగన్ బుడమేరు నది అని జగన్ చెప్పడాన్ని చంద్రబాబు ఎద్దేవా చేశారు. ‘వాగుకూ, నదికీ తేడా తెలియదు. టమోటాకు, పొటాటోకు వ్యత్యాసం తెలియదు. ఆయనకు తెలిసిందల్లా సాయంత్రానికి గల్లాపెట్టె దగ్గర కూర్చుని ఎంత వసూలైందో చూసుకోవడమే’ అని ఎద్దేవాచేశారు.