తెలంగాణవీణ జాతీయం : జూనియర్ వైద్యురాలిపై హత్యాచార ఘటన నేపథ్యంలో ఆసుపత్రి మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌పై పలు ఆరోపణలు రావడంతో సీబీఐ అరెస్టు చేయడంతో ప్రస్తుతం ఆయన జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. కాగా శుక్రవారం ఆయన నివాసంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ED) దాడులు చేసింది. ఘోష్, అతడి సహచరులకు సంబంధించిన వివిధ ప్రదేశాలలో దర్యాప్తు సంస్థ అధికారులు దాడులు చేశారు. ఆస్పత్రి డేటా ఎంట్రీ ఆపరేటర్ ప్రసూన్ ఛటర్జీ ఇంట్లో కూడా సోదాలు చేసినట్లుగా అధికారులు పేర్కొన్నారు.వైద్యురాలిపై హత్యాచారం అనంతరం కేసులో సీబీఐ దర్యాప్తు చేస్తుండగా ఆ కళాశాల మాజీ ప్రిన్సిపల్ సందీప్‌ఘోష్ సంబంధించిన పలు అవినీతి, అక్రమ కార్యకలాపాలు బయటపడ్డాయి. ఆసుపత్రి ఆస్తులను కాలేజీ కౌన్సిల్ లేదా స్వాస్త్ భవన్ అనుమతులు లేకుండానే ఘోష్ లీజుకు ఇచ్చేవాడు. ఇక వైద్యశాలకు అవసరమైన పరికరాలు, ఔషధాల సరఫరాదారుల ఎంపికలో బంధుప్రీతి చూపించాడు. కోట్ల రూపాయల విలువైన కొటేషన్ల విషయంలో కుమ్మక్కై అనర్హులకు ఇచ్చాడు. అనాథ శవాలు, వినియోగించిన సిరంజ్‌లు, సెలైన్ బాటిల్స్, రబ్బర్ గ్లౌజులు వంటివి ఆసుపత్రిలో ప్రతీ రెండ్రోజులకు 500-600 కిలోలు పోగయ్యేవి. వాటిని ఇద్దరు బంగ్లాదేశీవాసుల సాయంతో ఘోష్ రీసైక్లింగ్ చేయించేవాడు. దీంతో ఆర్థిక అవకతవకల కేసులో సీబీఐ అతడిని అరెస్టు చేసి, ఎనిమిది రోజుల పాటు పోలీస్ కస్టడీలో ఉంచింది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అతని సభ్యత్వాన్ని సస్పెండ్ చేసింది. కాగా హత్యాచారం కేసులో పోలీసులు, అధికారులు నిందితులను కాపాడటానికి, సాక్ష్యాలను ధ్వంసం చేయడానికి ప్రయత్నించినట్లు విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అధికార తృణమూల్ కాంగ్రెస్ ఈ కేసు విషయంలో అలసత్వం ప్రదర్శిస్తుందని ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. అపరాజిత బిల్లు కాపీ పేస్ట్‌లా ఉంది: బెంగాల్ గవర్నర్కోల్‌కతా హత్యాచార ఘటన నేపథ్యంలో ఇటీవల ఆమోదించిన అపరాజిత బిల్లు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, అరుణాచల్ ప్రదేశ్‌లు ఆమోదించిన బిల్లులకు కాపీ పేస్ట్‌లా ఉందని పశ్చిమబెంగాల్ గవర్నర్ సీవీ ఆనందబోస్ విమర్శించారు.‘‘అపరాజిత బిల్లుతో పాటు సాంకేతిక నివేదికను జత చేయడంలో రాష్ట్ర పరిపాలన విఫలమైంది. నియమం ప్రకారం, బిల్లుకు ఆమోదం ఇవ్వడంపై నిర్ణయం తీసుకునేముందు రాష్ట్ర ప్రభుత్వం సాంకేతిక నివేదికను పంపడం తప్పనిసరి. కానీ వాటిని పంపలేదు. అందువల్ల బిల్లులను క్లియర్ చేయడంలో ఆలస్యం అవుతోంది. అయినా ప్రభుత్వం తన తప్పులను పక్కనపెట్టి రాజ్‌భవన్‌పై నిందలు వేస్తోంది’’ అని రాజ్ భవన్ గురువారం వెల్లడించింది. పశ్చిమబెంగాల్ శాసనసభ సెప్టెంబర్ 3న రాష్ట్ర అత్యాచార నిరోధక బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించింది. రాష్ట్ర రాజధాని కోల్‌కతాలో జూనియర్ వైద్యురాలి హత్యాచార ఘటన నేపథ్యంలో ‘అపరాజిత ఉమెన్ అండ్ చైల్డ్ బిల్లు(పశ్చిమబెంగాల్ క్రిమినల్ లాస్ అండ్ అమెండ్‌మెంట్) 2024’ పేరిట రాష్ట్ర ప్రభుత్వం దీనిని తీసుకువచ్చింది. ఈ ముసాయిదా బిల్లు ప్రకారం.. అత్యాచారానికి గురైన బాధితులు మరణించినా, కోమాలోకి వెళ్లిపోయినా దోషికి ఉరిశిక్ష విధిస్తారు. అత్యాచారానికి పాల్పడిన దోషులకు పెరోల్ లేని జీవితఖైదును విధిస్తారు.