తెలంగాణవీణ జాతీయం : పశ్చిమబంగా ఛాత్ర సమాజ్ నాయకుడి బెయిల్‌ను వ్యతిరేకిస్తూ పశ్చిమబెంగాల్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తీరుపై అత్యున్నత న్యాయస్థానం పెదవివిరిచింది. ఆందోళనలకు సంబంధించి కేవలం ఒకే వ్యక్తిని ఎందుకు అరెస్టు చేశారని ప్రశ్నించింది.దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా జూనియర్ వైద్యురాలిపై హత్యాచార ఘటన పై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఛాత్రసమాజ్ ఆగస్టు 27న చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. ‘నబన్నా అభియాన్’ పేరుతో ర్యాలీ చేపట్టిన ఆందోళనకారులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. బాష్పవాయువు ప్రయోగించడం, లాఠీఛార్జ్ చేయడంతో ఘర్షణలు చోటుచేసుకున్నాయి. దీంతో నిరసనకారులు, పలువురు పోలీసులు గాయపడ్డారు.ఈ క్రమంలోనే ఛాత్రసమాజ్ నిర్వాహకుల్లో ఒకరైన సయన్ లాహిరిని అదే రోజు రాత్రి పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఆయన తల్లి కలకత్తా హైకోర్టును ఆశ్రయించగా.. గతవారం ఉన్నత న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. దీనిపై బెంగాల్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం సోమవారం విచారణ చేపట్టింది.నిందితుడని.. ఇంటిని కూల్చేస్తారా?‘బుల్డోజర్ చర్యల’పై సుప్రీంకోర్టు ఆగ్రహం ఈ సందర్భంగా బెంగాల్ ప్రభుత్వానికి ధర్మాసనం పలు ప్రశ్నలు సంధించింది. ‘‘ఎంతో మంది ఆందోళనలు చేస్తే.. కేవలం ఈ వ్యక్తినే ఎందుకు అరెస్టు చేశారు?’’ అని ప్రశ్నించింది. దీనికి ప్రభుత్వం బదులిస్తూ.. ర్యాలీకి పిలుపునిచ్చిన వారిలో లాహిరి ఒకరని, నాడు జరిగిన ఘర్షణల కారణంగా 41 మంది పోలీసులు గాయపడ్డారని తెలిపింది. దీంతో ధర్మాసనం స్పందిస్తూ.. ‘‘అంటే ఈ ఒక్క వ్యక్తే 41 మందిని గాయపర్చారని మీరు చెబుతున్నారా?’ అని ఆగ్రహించింది. ఈ పిటిషన్‌ను విచారణ అర్హత లేదంటూ కొట్టివేసింది.కోల్‌కతాలో ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో చోటుచేసుకున్న ఈ హత్యాచార ఘటనపై బెంగాల్‌లో గత కొన్ని రోజులుగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఆందోళనలను రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోవడంపై ఇటీవల సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. శాంతియుతంగా ఆందోళనలు చేస్తున్నవారిపై అధికారం ప్రదర్శించాలనుకోవద్దని దీదీ సర్కారును హెచ్చరించింది.