తెలంగాణవీణ జాతీయం : బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను భారత్ తమ దేశానికి అప్పగిస్తుందా, లేదా అని అక్కడి తాత్కాలిక ప్రభుత్వం ప్రశ్నించింది. అంతర్జాతీయ మీడియా వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం విదేశీ వ్యవహారాల సలహాదారు ఎండీ తౌహిద్ హుస్సేన్ మీడియాతో మాట్లాడుతూ హసీనాను బంగ్లాకు రప్పించడానికి యూనస్ ప్రభుత్వం ఏమైనా చేస్తుందని పేర్కొన్నారు. ఆమెను బంగ్లాకు అప్పగించాలని భారత్‌ను ఎన్నిసార్లు అడిగినా జవాబు లేదని అసహనం వ్యక్తంచేశారు. హసీనాను అప్పగించాలా, వద్దా అనే విషయంపై నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత భారత్‌పైనే ఉందని వ్యాఖ్యానించారు. ‘‘మా న్యాయవ్యవస్థ తలుచుకుంటే ఆమెను ఎలాగైనా తిరిగి తీసుకురావడానికి ప్రయత్నిస్తాము. మనకు భారత్‌తో వివిధ ఒప్పందాలు, చట్టపరమైన ప్రక్రియలు ఉన్నాయి’’ అని ఆయన పేర్కొన్నారు. హసీనా భారత్‌లో ఎక్కడ తలదాచుకున్నారనే విషయం బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వానికి తెలుసా అని మీడియా ప్రశ్నించడంతో ‘ఆ విషయం భారత్‌ను అడగండి’ అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. హసీనా ప్రభుత్వం చేపట్టిన రిజర్వేషన్లకు వ్యతిరేకంగా విద్యార్థులు పెద్దఎత్తున నిరసనలు చేపట్టడంతో ఆమె దేశం వదిలి పారిపోయి, భారత్‌లో ఆశ్రయం పొందుతున్నారు. అయితే బంగ్లాదేశ్ హసీనా, ఆమె బంధువుల దౌత్య పాస్‌పోర్ట్‌లను రద్దు చేసింది.భారత్‌తో బంగ్లాదేశ్ ద్వైపాక్షిక సంబంధాల విషయంలో హసీనా అప్పగింత అంశం కీలక పాత్ర పోషిస్తుందని బీఎన్‌పీ (బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ) ఇప్పటికే తేల్చిచెప్పింది. ఈ విషయాన్ని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి మిర్జా ఫఖ్రూల్ ఇస్లాం ఆలంగీర్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆమెకు భారత్‌లోనే ఆశ్రయం కొనసాగితే భవిష్యత్తులో ఇరుదేశాల మధ్య సంబంధాలు దెబ్బతింటాయని పేర్కొన్నారు. న్యూదిల్లీతో బలమైన సంబంధాలను బీఎన్‌పీ కోరుకుంటోందని ఆయన తెలిపారు.హసీనా హయాంలో రిజర్వేషన్లపై విద్యార్థులు చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో వందల మంది ప్రాణాలు కోల్పోయారు. వారి కుటుంబసభ్యుల మరణాలకు హసీనానే కారణమని ఆరోపిస్తూ పలువురు ఫిర్యాదులు చేశారు. దీంతో బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఆమెతో పాటు మాజీ మంత్రులు, అనుచరులపై పోలీసులు 31 కేసులు నమోదు చేశారు. మొత్తంగా హసీనా ప్రస్తుతం 53 కేసులు ఎదుర్కొంటున్నారు. వీటిలో 44 హత్య కేసులు, మారణహోమానికి సంబంధించి ఏడు కేసులతో పాటు బీఎన్‌పీ పార్టీ ఊరేగింపు సమయంలో చోటుచేసుకున్న ఘర్షణలో ఆమెపై దాడి కేసు నమోదయ్యింది.