తెలంగాణవీణ జాతీయం :యూట్యూబ్‌కుఉన్న ఆదరణ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఉచితంగా లభిస్తుండడం, రోజుకు లక్షలాది వీడియోలు అందుబాటులో వస్తుండడమే దీనికి కారణం. దీన్నే ఇప్పుడు సైబర్ నేరగాళ్లు ఆసరాగా చేసుకుంటున్నారు. వీడియోలు క్రియేట్ చేసేవారి ఖాతాలను హ్యాక్ చేస్తూ సమాచారాన్ని తస్కరిస్తున్నారు. ఇది ఈ మధ్య సర్వసాధారణం అయిపోయింది. చాలామంది యూట్యూబ్ క్రియేటర్లు గత్యంతరం లేక మరో ఛానెల్‌ను క్రియేట్ చేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. ఈ సమస్యను గుర్తించిన గూగుల్.. ఏఐ సాయంతో ఓ పరిష్కార మార్గంతో ముందుకొచ్చింది.హ్యాక్ అయిన ఖాతాలను రికవర్ చేసుకునేందుకు వీలుగా కొత్త టూల్‌ను గూగుల్ రూపొందించింది. గూగుల్ అకౌంట్, యూట్యూబ్ ఛానెల్‌కు సంబంధించి పలు ప్రశ్నలు సంధిస్తూ తొలుత లాగిన్‌ను పునరుద్ధరిస్తుంది. అనంతరం హ్యాకర్ ఏమైనా మార్పులు చేసి ఉంటే వాటిని తొలగించి పూర్వస్థితికి తీసుకొస్తుంది.ఈ టూల్ ఏఐ ఆధారిత చాట్ అసిస్టెంట్ రూపంలో యూట్యూబ్‌క్రియేటర్లకు అందుబాటులోకి రానుంది. ఖాతా హ్యాక్ అయినట్లు ఈ టూల్ నిర్ధరిస్తే.. గూగుల్ సపోర్ట్‌ను సంప్రదించాల్సిన అవసరం లేకుండానే రికవర్ చేసేందుకు అనుమతి ఇస్తుంది. ప్రొఫైల్ పిక్చర్, యాడ్‌సెన్స్ అకౌంట్‌లో మార్పులు సహా అనధీకృత వీడియోల అప్‌లోడ్ వంటి మార్గాల ద్వారా తొలుత ఖాతా హ్యాకైందో.. లేదో.. నిర్ధరించుకోవాలని గూగుల్ సూచించింది. అదే నిజమైతే యూట్యూబ్ హెల్ప్ సెంటర్ ద్వారా టూల్‌ను ఉపయోగించుకొని అకౌంట్‌ను రికవర్ చేసుకోవచ్చని పేర్కొంది.
ప్రస్తుతానికి ఈ టూల్ ఆంగ్లంలో మాత్రమే అందుబాటులో ఉంది. పైగా ఎంపిక చేసిన క్రియేటర్లకు మాత్రమే లభిస్తోంది. త్వరలో అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకవేళ ఎవరికైనా ఈ టూల్ అవసరం ఉండి.. అందుబాటులో లేకపోతే ఎక్స్‌లో ను సంప్రదించి సహాయం పొందొచ్చని గూగుల్ తమ సపోర్ట్ పేజీలో తెలిపింది.
యూట్యూబ్ అకౌంట్ హ్యాకైందా? రికవరీ కోసం ఏఐ టూల్ వచ్చేసింది!
