తెలంగాణవీణ జాతీయం : కొన్నాళ్లుగా తాను కాంగ్రెస్ పార్టీలో చేరతానని జరుగుతున్న ప్రచారంపై తాజాగా ఒలింపియన్ వినేశ్ ఫొగాట్ స్పందించారు. ఇందుకు రైతు ఆందోళన వేదికైంది. హరియాణాలోని అంబాలాకు సమీపంలోని శంభూ సరిహద్దు వద్ద రైతులు కొన్నాళ్లుగా చేపట్టిన ఆందోళనలో నేడు ఒలింపియన్ వినేశ్ ఫొగాట్ పాల్గొని వారికి మద్దతు తెలిపారు. ఇక్కడ చేపట్టిన ఆందోళన 200వ రోజుకు చేరిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సంఘీభావంగా పాల్గొని మాట్లాడుతూ.. మీ కుమార్తె మీ వెంటే ఉంటుందని వ్యాఖ్యానించారు.ఈ సందర్భంగా ఓ విలేకరి ఆమెను ఉద్దేశించి ‘‘మీరు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారా..?’’ అని ప్రశ్నించారు. దీనికి వినేశ్ స్పందిస్తూ ‘‘ ఈ అంశంపై మాట్లాడదల్చుకోలేదు. నా రైతు కుటుంబాన్ని కలుసుకోవడానికే ఇక్కడికి వచ్చాను. మీరు దృష్టిని నా వైపు తిప్పితే.. వారి పోరాటం, కష్టాలు వృథా అవుతాయి. ఇక్కడ నాపై ఫోకస్ ఉండకూడదు.. రైతులపై మాత్రమే ఉండాలి. నేనొక క్రీడాకారిణిని, భారతీయురాలిని. ఎన్నికలపై నాకు ఎలాంటి ఆందోళన లేదు. రైతుల సంక్షేమంపై మాత్రమే నా దృష్టి ఉంది’’ అని సమాధానం చెప్పారు. డిమాండ్లు తీరే వరకు వెనక్కి తగ్గొద్దు..ఈ సందర్భంగా ఆందోళనను ఉద్దేశించి మాట్లాడుతూ ‘‘నేను రైతు కుటుంబంలో పుట్టినందుకు అదృష్టవంతురాలిని. మీ కుమార్తె మీతోనే ఉందన్న ఉందన్న విషయం చెప్పదల్చుకొన్నాను. మన హక్కుల కోసం మనమే నిలబడాలి.. ఎవరూ రారు. మీ డిమాండ్లు పూర్తి కావాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నా. వాటిని సాధించుకోకుండా వెనుదిరగ వద్దు.రైతులు తమ హక్కుల కోసం 200 రోజుల నుంచి కూర్చొని ఉన్నారు. ఈ డిమాండ్లను పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని నేను కోరుతున్నాను. కానీ, కేంద్రం ఇన్నాళ్లుగా మీ డిమాండ్లు వినకపోవడం బాధాకరం’’ అని పేర్కొన్నారు. రైతు నేత స్వర్ణ సింగ్ పంధేర్ మాట్లాడుతూ ఆందోళనలు ప్రశాంతంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం వారి దీక్షను పరీక్షిస్తోందని పేర్కొన్నారు. ‘‘మరోసారి మన డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళదాము. దీంతోపాటు కొత్త అంశాలను కూడా ప్రకటిద్దాము’’ అని పంధేర్ రైతులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. దిల్లీలో ర్యాలీకి అధికారులు నిరాకరించడంతో రైతులు ఫిబ్రవరి 13వ తేదీ నుంచి శంభూ సరిహద్దుల వద్దే ఆందోళన చేపట్టారు. పంటలకు చెల్లించే కనీస మద్దతు ధరకు ప్రభుత్వం గ్యారెంటీ ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
.