తెలంగాణవీణ సినిమా : విక్రమ్ నటించిన తాజా చిత్రం ‘తంగలాన్’ ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్ తో వర్కింగ్ గురించి విక్రమ్ స్పందించారు. ఆమె తనకు మంచి మిత్రురాలన్నారు. ఆమె కంటే ఎక్కువగా అభిషేక్ బచ్చన్‌తోనే తనకు మంచి అనుబంధం ఉందని చెప్పారు. తమ కాంబోలో వచ్చిన రెండు చిత్రాల్లోనూ ముగింపు బాధాకరంగా ఉంటుందని ఆయన తెలిపారు.‘‘అభిషేక్ బచ్చన్ నాకు క్లోజ్ ఫ్రెండ్. దానివల్ల ఆయన కుటుంబసభ్యులతోనూ నాకు మంచి అనుబంధం ఉంది. ఐశ్వర్యరాయ్ మంచి మిత్రురాలు. ఆమె గొప్ప నటి. మా మధ్య చక్కని ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ ఉంది. సినీప్రియులు దానిని ఆస్వాదిస్తుంటారు. ఇప్పటివరకూ మా కాంబోలో ‘రావన్’, ‘పొన్నియిన్ సెల్వన్’ చిత్రాలు వచ్చాయి. ఆయా చిత్రాల్లో మా పాత్రల ప్రేమకథకు సరైన ముగింపు ఉండదు. రెండు చిత్రాల్లోనూ ఆమె వేరే వ్యక్తి భార్యగా కనిపిస్తారు. చివరకు నా పాత్ర మృతి చెందుతుంది. అది ఫ్యాన్స్‌ను బాధకు గురిచేస్తుంది. ఇదే విషయంపై దర్శకుడు మణిరత్నంను నేను రిక్వెస్ట్ చేశా. మా ఇద్దరి పాత్రలకు సంతోషకరమైన ముగింపు ఇచ్చేలా ఒకే ఒక్క సినిమా చేయమని అడిగా. దానివల్ల అభిమానులు ఆనందపడతారని చెప్పా’’ అని విక్రమ్ తెలిపారు.విక్రమ్ – అభిషేక్ బచ్చన్ – ఐశ్వర్యరాయ్ కాంబోలో తెరకెక్కిన తొలి చిత్రం ‘రావన్ మణిరత్నం దర్శకత్వం వహించారు. ఈ సినిమా క్లైమాక్స్‌లో విక్రమ్ పాత్ర మృతి చెందుతుంది. ఇదే కాంబోలో ఇటీవల వచ్చిన చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్’చోళుల వైభవం, ఆ సామ్రాజ్య పతనానికి కారణమైన విషయాలను తెలియజేస్తూ దీనిని రూపొందించారు. ఇందులో ఆదిత్య కరికాలన్‌గా విక్రమ్, నందినిగా ఐశ్వర్యరాయ్ నటించారు. ఇద్దరూ ప్రేమించుకున్నప్పటికీ అనివార్య కారణాల వల్ల నందిని మరో వ్యక్తిని పెళ్లాడాల్సి వస్తుంది. ఆదిత్య కరికాలన్ పాత్ర మృతితో ఈ సినిమా ముగుస్తుంది. ‘తంగలాన్’ విషయానికి వస్తే.. ఆగస్టు 15న ఈ చిత్రం దక్షిణాదిలో విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది. ఈనేపథ్యంలోనే శుక్రవారం దీనిని హిందీలో విడుదల చేశారు.