తెలంగాణవీణ సినిమా :ఏ పండగ వచ్చినా ఒక్క ఫొటోతో మెగా అభిమానుల్లో ఫుల్ జోష్ నింపుతుంటారు ఆ కుటుంబ సభ్యులు. తాజాగా రామ్ చరణ్ కుమార్తె క్లీంకార జన్మాష్టమి వేడుకల ఫొటోలు ఎక్స్‌లో సందడి చేస్తున్నాయి. క్లీంకారతో కలిసి పూజ గదిలో ఉన్న ఫొటోలను పంచుకున్న ఉపాసన ‘అమ్మా, కారా ఇద్దరూ పూజ చేసుకుంటున్న సమయం’ అని క్యాప్షన్ పెట్టారు. అలాగే మరో ఫొటో పంచుకుంటూ.. ‘మా పూజలో నాన్న, రైమ్ (పెంపుడు శునకం) కూడా చేరారు’ అని రాసుకొచ్చారు. ఇక క్లీంకారతో సురేఖ అడుగులు వేయించారు. ఈ ఫొటోలను మెగా అభిమానులు షేర్ చేస్తున్నారు. ‘క్యూట్’ అని కామెంట్లు పెడుతున్నారు. తాజాగా రామ్ చరణ్ ఓ ఇంటర్వ్యూలో క్లీంకార గురించి మాట్లాడుతూ తనకు చిన్న గుర్రాన్ని బహుమతిగా ఇచ్చినట్లు చెప్పారు. ‘నాకు మూగజీవులంటే ఇష్టం. నేను ‘మగధీర’లో ఉపయోగించిన గుర్రానికి ఇటీవలే పిల్ల పుట్టింది. దాన్ని మా అమ్మాయికి బహుమతిగా ఇచ్చాను. ఇంత చిన్న వయసులోనే క్లీంకార చిన్న గుర్రంపై ఎక్కి స్వారీ చేసేందుకు ప్రయత్నిస్తోంది. గుర్రపు స్వారీ విషయంలో మా ఇద్దరి అభిరుచులు ఒకటే’ అని చెప్పారు.