Friday, September 20, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

రివ్యూ: త్రిష నటించిన బృంద..తొలి వెబ్‌సిరీస్‌ ఎలా వుందంటే :

Must read

తెలంగాణవీణ జాతీయం : అటు గ్లామరస్‌ పాత్రలతో పాటు, ఇటు నాయిక ప్రాధాన్యమున్న చిత్రాల్లోనూ నటించి అలరించారు త్రిష. చిత్ర పరిశ్రమలో సుదీర్ఘ కెరీర్‌ కొనసాగిస్తున్న ఆమె తొలిసారి ఓ వెబ్‌సిరీస్‌లో నటించారు. ‘బృంద’గా సోనీలివ్‌ వేదికగా స్ట్రీమింగ్‌ అవుతోంది. ఓటీటీ ప్రేక్షకులను విశేషంగా అలరించిన ఏ క్రైమ్‌ థ్రిల్లర్‌ తీసుకున్నా మెయిన్‌ థీమ్‌ ఒక్కటే. ఏదో ఒక ప్రాంతంలో ఒకే తరహాలో హత్యలు జరగడం.. వాటిని హీరో/హీరోయిన్‌ ఛేదించడం. కథలోని ప్రధాన పాత్రలకూ హంతకుడి మధ్య దాగుడుమూతలు ఎంత ఆసక్తికరంగా సాగాయన్నదాని బట్టి విజయం ఆధారపడి ఉంది. ఈ విషయంలో ‘బృంద’ దర్శకుడు సూర్య మనోజ్‌ విజయాన్ని సాధించారు. కథపరంగా చూస్తే, రొటీన్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ థీమే అయినా, త్రిషలాంటి అగ్ర కథానాయిక నటించడంతో కాస్త ఆసక్తి ఏర్పడింది. అందుకు తగినట్లుగానే కథ, కథనాలు ప్రారంభమవుతాయి. బృంద ఓ పోలీస్‌స్టేషన్‌లో కొత్తగా చేరిన ఎస్సై. మహిళ కావడంతో తోటి పోలీసులు ఆమెకు ప్రాధాన్యం ఇవ్వరు. అయినా తన పని చేసుకుంటూ వెళ్లిపోతుంది. ఈ క్రమంలో స్థానిక చెరువులో ఓ శవం. దానికి గుండు కొట్టి, గుండెల్లో 16సార్లు కత్తితో పొడిచినట్లు పోస్ట్‌మార్టం రిపోర్ట్‌. తన ఉన్నతాధికారే క్లోజ్‌ చేయమన్న కేసును పట్టుబట్టి బృంద ఇన్వెస్టిగేషన్‌ చేయడం. ఈ తరహాలో హత్యకు గురైన వారు ఒక్కరు కాదని, మొత్తం 16మంది అతి దారుణంగా హత్యకు గురయ్యారని ట్విస్ట్‌ రివీల్‌ కావడం. దీంతో పోలీస్‌ ఉన్నతాధికారులు ప్రత్యేక విచారణ బృందాన్ని ఏర్పాటు చేసి, అందులో బృందని భాగస్వామి చేయడం. ఈ టీమ్‌ సీరియల్‌ కిల్లర్‌ను ఎలా పట్టుకుంది అనేది కథ. ఆరంభ సన్నివేశం నుంచే ఆసక్తిరేకెత్తించేలా ‘బృంద’ స్క్రీన్‌ప్లేను నడిపించాడు దర్శకుడు. ప్రతి ఎపిసోడ్‌లోనూ ముందుగా బృంద, ఆమె గతానికి సంబంధించిన విశేషాలను ఒక్కొక్కటిగా పరిచయం చేస్తూ, ఆ తర్వాత వర్తమానంలో జరిగే దారుణ హత్యల ఇన్వెస్టిగేషన్‌ను సమాంతరంగా నడిపించడం వల్ల, సిరీస్‌ చూస్తున్న ప్రేక్షకుడికి భూత, వర్తమాన కాలాల్లో జరిగే సంఘటలను ఒకదానితో ఒకటి ముడివేస్తూ చెప్పిన తీరు బాగుంది.తన ఆత్మగౌరవాన్ని ఎవరు దెబ్బతీసినా సహించని వ్యక్తిత్వం కలిగిన అమ్మాయిగా, హత్యకు సంబంధించిన క్లూస్‌ కనిపెట్టే తెలివైన పోలీస్‌ ఆఫీసర్‌గా బృంద పాత్రను తీర్చిదిద్దాడు దర్శకుడు. అందుకు తగినట్లుగానే కథాగమనం, అందులోని సన్నివేశాలు నడుస్తాయి.హంతకుడికి సంబంధించిన వివరాలు సేకరించే క్రమంలో ఒక్కో క్లూను కనిపెడుతూ బృంద, ఆమె టీమ్‌ చేసే ప్రయాణం ఆసక్తికరంగా ఉన్నా డీటెయిల్‌ ఇన్వెస్టిగేషన్‌ పేరుతో సిరీస్‌ నిడివి కాస్త ఇబ్బంది పెడుతుంది. క్రైమ్‌ థ్రిల్లర్‌ జానర్‌ అంటే పగ, ప్రతీకారాల కోసమే హత్య చేయడం కాదు, మూఢ నమ్మకాల వంటి ఎలిమెంట్స్‌ను జోడిస్తున్నారు. ఇందులోనూ అలాంటి అంశాన్ని జత చేశారు. ఆయా సన్నివేశాలను ఆసక్తిగానూ తీశారు. హత్యల వెనుక ఉన్నదెవరో తెలిసిన తర్వాత కథ, కథనాలు మరింత పరుగులు పెడతాయి. అవన్నీ ప్రేక్షకుడిని అలరిస్తాయి. చివరి ఎపిసోడ్స్‌లో డ్రామా మరింత ఉత్కంఠగా తీర్చిదిద్దడం బాగుంది.
కథానాయికగా వరుస సినిమాలతో అలరించిన త్రిష.. పోలీస్‌ ఆఫీసర్‌ బృందగా ఈ వెబ్‌సిరీస్‌ తనదైన నటన కనబరిచారు. ఆత్మగౌరవం కలిగిన మహిళగా ఆ పాత్రను తీర్చిదిద్దిన విధానం బాగుంది. అమాయకత్వం, క్రూరత్వం కలగలుపుతూ హంతకుడి పాత్రలో ఆనందసామి నటన సిరీస్‌కు హైలైట్‌. ఇంద్రజీత్‌, రవీంద్ర విజయ్‌ తదితరులు తమ పరిధి మేరకు నటించారు. టెక్నికల్‌ టీమ్‌ ఎఫెక్ట్‌ ప్రతి ఎపిసోడ్‌లోనూ కనిపిస్తుంది. రచయిత, దర్శకుడు సూర్య మనోజ్‌ ప్రయత్నం బాగుంది. నిడివి ఇబ్బంది పెట్టినా మొదటి నుంచి చివరి వరకూ ఎంగేజింగ్‌గా కథను నడపడటంలో మంచి మార్కులు పడతాయి.కుటుంబంతో చూడొచ్చా: ఎలాంటి అభ్యంతరం లేకుండా చూడొచ్చు. అసభ్య సన్నివేశాలు, సంభాషణలు లేకుండా రచయితలు జాగ్రత్తలు తీసుకున్నారు.
బలాలు

  • కథ, కథనాలు
  • త్రిష నటన
  • దర్శకత్వం
    బలహీనతలు
  • నిడివి
    చివరిగా: ఎంగేజింగ్‌ ‘బృంద’..
    గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.
- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you