తెలంగాణవీణ జాతీయం : సికింద్రాబాద్: రైల్వే టికెట్ కౌంటర్ల వద్ద టికెట్ల కొనుగోలు ఇకపై సులభతరం కానుంది. క్యూఆర్ కోడ్ ద్వారా డిజిటల్ చెల్లింపులు చేసే సదుపాయం అందుబాటులోకి తీసుకొచ్చినట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. దీంతో ప్రయాణికులకు టికెట్ కొనుగోలులో చిల్లర కష్టాలు తీరనున్నాయి. తొలుత ప్రధాన రైల్వే స్టేషన్లలోనే ఈ సదుపాయం ఉండగా.. ఇప్పుడు అన్ని స్టేషన్లకూ విస్తరించినట్లు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో పేర్కొంది.రైల్వే స్టేషన్లలోని జనరల్ బుకింగ్, రిజర్వేషన్ కౌంటర్లలో క్యూఆర్ కోడ్‌ను ఉపయోగించి ఇకపై డిజిటల్ చెల్లింపులు చేయొచ్చని దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. ఇందుకోసం అన్ని స్టేషన్లలోని టికెట్ విండో వద్ద ప్రత్యేక డివైజ్‌ను ఉంచుతున్నట్లు తెలిపింది. ప్రయాణికుడికి సంబంధించిన అన్ని వివరాలూ కంప్యూటర్‌లో ఎంటర్ చేశాక.. ఆ డివైజ్‌లో క్యూఆర్ కోడ్ ప్రత్యక్షమవుతుంది. దాన్ని యూపీఐ యాప్స్ వినియోగించి చెల్లింపులు చేయొచ్చు. పేమెంట్ పూర్తవ్వగానే టికెట్‌ను అందిస్తారు.సికింద్రాబాద్ వంటి ప్రధాన రైల్వే స్టేషన్లకే పరిమితమైన క్యాష్‌లెస్ సదుపాయాన్ని జోన్ పరిధిలోని అన్ని రైల్వే స్టేషన్లకు విస్తరిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఇప్పటికే అన్ని స్టేషన్లకు డివైజులను పంపించామని, దశలవారీగా మరికొన్ని రోజుల్లో అన్ని స్టేషన్లలో ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయని తెలిపింది. ఈ విషయంలో కీలకంగా వ్యవహరించిన కమర్షియల్, టెక్నికల్ సిబ్బందిని దక్షిణ మధ్య రైల్వే మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ కొనియాడారు. ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ప్రయాణికులకు సూచించారు.