తెలంగాణవీణ సినిమా :తంగలాన్; నటీనటులు: విక్రమ్, మాళవిక మోహనన్, పార్వతి తిరువొత్తు, పశుపతి, డానియల్ కాల్టాగిరోన్ తదితరులు; సంగీతం: జీవీ ప్రకాశ్‌కుమార్; ఎడిటింగ్: సెల్వ ఆర్.కె.; సినిమాటోగ్రఫీ: ఎ.కిషోర్ కుమార్; నిర్మాత: కె.ఇ.జ్ఞానవేల్ రాజా, పా.రంజిత్, జ్యోతి దేశ్ పాండే; దర్శకత్వం: పా.రంజిత్; విడుదల: 15-08-2024
ప్రయోగాత్మక పాత్రలతో విక్రమ్.. సామాజిక సమస్యల ఇతివృత్తంగా సాగే కథాంశాలతో దర్శకుడు పా.రంజిత్ అలరిస్తుంటారు. ఇప్పుడీ ఇద్దరి కాంబో నుంచి వచ్చిన కొత్త చిత్రం ‘తంగలాన్’. ప్రచార చిత్రాల్లో చూపించిన ‘తంగలాన్’ ప్రపంచం.. ఆ పాత్ర కోసం విక్రమ్ తనని తను మార్చుకున్న తీరు.. అన్నీ ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేలా చేశాయి. మరి ఈ ‘తంగలాన్’ కథేంటి? ఇది సినీప్రియులకు ఎలాంటి అనుభూతిని అందించింది? (కథేంటంటే): 1850ల్లో ఆంగ్లేయుల పాలనా కాలంలో జరిగే కథ ఇది. కర్ణాటక సరిహద్దున ఉన్న వేపూరు గ్రామంలోని ఓ గిరిజన తెగకు చెందిన నాయకుడు తంగలాన్ (విక్రమ్). అతని భార్య గంగమ్మ (పార్వతి తిరువొత్తు). వీళ్లకు ఐదుగురు పిల్లలు. ఊళ్లో తమకున్న కొద్దిపాటి భూమిని సాగు చేసుకుంటూ సంతోషంగా జీవితాన్ని సాగిస్తుంటారు. అయితే వాళ్లు పండించిన పంటను ఓసారి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు తగలబెడతారు. అదే సమయంలో పన్ను కట్టలేదన్న సాకుతో తంగలాన్ భూమిని ఊరి జమిందారు స్వాధీనం చేసుకుంటాడు. సరిగ్గా అప్పుడే తెల్లదొర క్లెమెంట్ (డేనియల్) వేపూరుకు వస్తాడు. ఆ ఊరికి సమీపంలోని అటవీ ప్రాంతంలో ఉన్న బంగారాన్ని వెలికి తీయడానికి తనతో వస్తే పెద్ద మొత్తంలో కూలీ ఇవ్వడంతో పాటు బంగారంలో వాటా ఇస్తానని ఆశ చూపుతాడు. అయితే ఆ అడవిలో బంగారాన్ని నాగజాతికి చెందిన మాంత్రికురాలు ఆరతి (మాళవిక మోహనన్) తన అతీంద్రియ శక్తులతో రక్షిస్తున్నట్లు తంగలాన్‌కు కలలో కనిపిస్తుంటుంది. అంతేకాదు తన తాతను ఆరతి వెంటాడినట్లు.. ఆమెను అతను చంపినట్లు తరచూ కలలొస్తుంటాయి. మరి నిజంగా ఆరతి ఉందా? ఆమె ఆ ప్రాంతంలోని బంగారాన్ని రక్షిస్తోందా? బంగారాన్ని వెలికి తీసేందుకు బ్రిటిషర్లతో కలిసి అడవిలోకి వెళ్లిన తంగలాన్‌కు.. అతని బృందానికి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? ఈ ప్రయాణంలో తంగలాన్ ఏం తెలుసుకున్నాడు? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే! (ఎలా సాగిందంటే): ఇది పైకి బంగారం అన్వేషణ నేపథ్యంలో సాగే కథాంశంగానే కనిపించినా.. అంతర్లీనంగా ఓ అణగారిన వర్గం తన జాతి మనుగడ కోసం.. స్వేచ్ఛా, స్వాతంత్య్రాల కోసం చేసిన పోరాటాన్ని చూపిస్తుంది. వర్ణ వివక్షపై ఎక్కు పెట్టిన అస్త్రంలా దర్శనమిస్తుంది. ఈ కథను చెప్పడానికి దర్శకుడు రంజిత్ సృష్టించుకున్న ప్రపంచం.. అక్కడ కనిపించే మనుషులు.. వాళ్ల వస్త్రధారణ.. మనుగడ సాగించే తీరు.. అన్నీ ప్రేక్షకులకు ఓ కొత్త లోకాన్ని పరిచయం చేస్తాయి. ఠక్కున వంద ఏళ్ల వెనక్కు తీసుకెళ్లిపోతాయి. తంగలాన్ కథ పరిచయమైన వెంటనే కథకు కీలకమైన బంగారు గనుల అంశం తెరపైకి వస్తుంది. ఇక్కడ కథకు దర్శకుడు జోడించిన ఫాంటసీ ఎలిమెంట్ బాగా వర్కవుటయ్యింది. అడవి.. అందులో ఉన్న ఏనుగు కొండ.. దాని వెనుక దాగి ఉన్న బంగారు నిధి.. దాన్ని కాపుకాసే ఆరతి.. ఆమె అతీంద్రియ శక్తులు.. అలాగే గనులకు రక్షణగా ఉండే సర్పజాతి.. బంగారం దక్కించుకునే క్రమంలో తంగలాన్ తాతకు నాగజాతికి మధ్య జరిగిన పోరాటం.. అన్నీ సినీప్రియులకు థ్రిల్ పంచుతాయి. రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తాయి. ఇక బ్రిటిషర్లతో కలిసి తంగలాన్ బృందం బంగారం వేటకు బయల్దేరినప్పటి నుంచి కథ మరింత వేగం పుంజుకుంటుంది. ఈ ప్రయాణంలో వీళ్లకు ఎదురయ్యే సవాళ్లు.. వాటిని అధిగమించి బంగారాన్ని కనిపెట్టే తీరు ఉత్కంఠరేకెత్తిస్తాయి. ఈ క్రమంలో వచ్చే విరామ సన్నివేశాలు ద్వితీయార్ధంపై అంచనాలు పెంచేలా చేస్తాయి.అయితే ప్రథమార్ధంలో బిగి సడలకుండా ఉత్కంఠభరితంగా సాగిన కథనం ద్వితీయార్ధంలో ఆరంభం నుంచే గాడి తప్పింది. కథంతా అక్కడక్కడే తిరుగుతున్న అనుభూతి కలుగుతుంది. బంగారాన్ని వెలికి తీసేందుకు తంగలాన్ తన ఊరి వాళ్లందర్ని ఆ నిధి ఉన్న ప్రాంతానికి తీసుకెళ్లడం.. అక్కడ బ్రిటిషర్ల నుంచి వారికి ఎదురయ్యే అవమానాలు.. కాస్త సాగతీతగా అనిపిస్తాయి. ఇక ప్రీక్లైమాక్స్‌లో తంగలాన్ బృందానికి.. బ్రిటిషర్లకు.. నాగజాతి తెగకు మధ్య జరిగే పోరు కొంత గందరగోళానికి గురి చేస్తుంది. అసలు తెరపై జరుగుతున్నది నిజమా.. తంగలాన్ ఊహా అన్నది ప్రేక్షకులకు ఓ పట్టాన అర్థం కాదు. క్లైమాక్స్‌లో తంగలాన్ పాత్రలోని మరో కోణం బయటకొస్తుంది. ఆ ట్విస్ట్ ప్రేక్షకులకు థ్రిల్ పంచుతుంది. కాకపోతే సినిమాని ముగించిన తీరు కాస్త గజిబిజిగా అనిపిస్తుంది.
(ఎవరెలా చేశారంటే): తంగలాన్ పాత్ర కోసం విక్రమ్ తనని తాను మార్చుకున్న తీరు.. ఆ పాత్ర కోసం తను పడిన కష్టం తెరపై ప్రతి ఫ్రేమ్‌లో కనిపిస్తుంది. పూర్తి డీగ్లామర్‌గా.. భిన్నమైన హెయిర్ స్టైల్.. ఒంటిపై కేవలం గోచీతో అచ్చమైన ఆదివాసిలా తను కనిపించిన తీరు.. పలికించిన హావభావాలు అందర్నీ కట్టిపడేస్తాయి. ఇలాంటి ప్రయోగాత్మక పాత్రలు ఆయన తప్ప ఇంకెవరూ ఇంత బాగా చేయరేమో అన్నట్లుగా ఉంటుంది. ఇది విక్రమ్ కెరీర్లో మరో మైలురాయి. గంగమ్మ పాత్రలో ఐదుగురు పిల్లల తల్లిగా పార్వతి కనిపించిన తీరు.. ఆమె వస్త్రధారణ.. విక్రమ్‌తో తన కెమిస్ట్రీ ఆకట్టుకుంటాయి. ఇక దీంట్లో విక్రమ్ తర్వాత అదే స్థాయిలో అందర్నీ ఆశ్చర్యపరిచే మరో పాత్ర మాళవిక మోహనన్దే. ఆరతి పాత్రలో ఆమె కనిపించిన తీరు.. తన లుక్స్.. విక్రమ్‌తో చేసే యాక్షన్ హంగామా.. అన్నీ అలరిస్తాయి. చాలా సీన్స్‌లో ఆమె స్క్రీన్ ప్రజెన్స్ ప్రేక్షకుల్ని భయపెడుతుంది. వర్ణ వ్యవస్థను రూపుమాపాలన్న లక్ష్యంతో బతికే వ్యక్తిగా పశుపతి పాత్ర ఆలోచింపజేసేలా ఉంటుంది. మిగిలిన పాత్రలన్నీ పరిధి మేరకు ఉంటాయి.పా.రంజిత్ ఈ కథను ఓ విజువల్ వండర్లా తెరపై చూపించే ప్రయత్నం చేశారు. కాకపోతే ఆ ప్రయత్నం కొంత మేరే ఫలించింది. ముఖ్యంగా దీంట్లో విజువల్ ఎఫెక్ట్స్ పూర్తిగా తేలిపోయాయి. అలాగే దర్శకుడు తను చెప్పాలనుకున్న సందేశాన్ని బలంగా చూపించలేకపోయాడనిపిస్తుంది. ద్వితీయార్ధాన్ని బాగా సాగదీసిన ఫీల్ కలుగుతుంది. ఈ చిత్రం సాంకేతికంగా చాలా విషయాల్లో బలంగా కనిపిస్తుంది. ముఖ్యంగా కాస్ట్యూమ్స్, మేకప్, ఆర్ట్స్ డిపార్ట్మెంట్స్ ఈ సినిమా కోసం ప్రాణం పెట్టి పని చేశాయి. అలాగే కథకు తగ్గట్లుగా జీవీ ప్రకాశ్ కుమార్ అందించిన సంగీతం కూడా ఆకట్టుకుంటుంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.
బలాలు
- కథా నేపథ్యం..
- విక్రమ్, మాళవికల నటన
- కథలోని ఫాంటసీ ఎలిమెంట్స్
బలహీనతలు - సాగతీతగా సాగే ద్వితీయార్ధం
- విజువల్ ఎఫెక్ట్స్
చివరిగా: ‘తంగలాన్’.. వెండితెరపై మరో కొత్త ప్రపంచం!
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!