తెలంగాణవీణ జాతీయం :తమిళ స్టార్ నటుడు విక్రమ్ విజయవాడలోని బాబాయ్ హోటల్‌లో ఈ ఉదయం సందడి చేశాడు. ఆయన నటించిన హిస్టారికల్ ఫాంటసీ యాక్షన్ మూవీ తంగలాన్ ఈ నెల 15న ఆడియన్స్ ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సినిమా బృందం విజయవాడలో సందడి చేసింది. ఈ సందర్భంగా వారంతా బాబాయ్ హోటల్‌లో టిఫిన్ చేసి సందడి చేశారు. నాయకానాయికలు విక్రమ్, మాళవిక మోహన్ హోటల్‌కు వచ్చిన వారితో సరదాగా ముచ్చటించారు. అభిమానులతో సెల్ఫీలు దిగారు. కర్ణాటకలోని కోలార్ బంగారు గనుల్లోని కార్మికుల జీవితాల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. పా రంజిత్ దీనికి దర్శకుడు. ఈ సందర్భంగా విక్రమ్ మాట్లాడుతూ తాను ఇప్పటి వరకు చాలా సినిమాల్లో నటించినప్పటికీ ఏ సినిమా కోసమూ ఇంతగా కష్టపడలేదని పేర్కొన్నాడు. భిన్నమైన ఈ కథలో గ్లామర్‌కు అస్సలు చోటులేదన్నాడు. సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్షకులు మరో ప్రపంచంలో విహరిస్తారని పేర్కొన్నాడు. ఈ సినిమాకు సెకండ్ పార్ట్ కూడా ఉంటుందని తెలిపాడు. కాగా, మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా విజయవాడ, గుంటూరులో ఈ రోజు మధ్యాహ్నం మీడియా సమావేశాలు నిర్వహిస్తారు.