తెలంగాణవీణ జాతీయం :‘తంగలాన్’గా ప్రేక్షకులను పలకరించనున్నారు కోలీవుడ్ నటుడు విక్రమ్ . ఈ పాన్ ఇండియా చిత్రం స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం విడుదల కానుంది. ఈ సందర్భంగా చెన్నైలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో విక్రమ్, హీరోయిన్ మాళవికా మోహనన్ దర్శకుడు పా. రంజిత్ తదితరులు పాల్గొన్నారు.విక్రమ్ మాట్లాడుతూ.. ‘‘తంగలాన్’పై వచ్చిన కామెంట్స్ విన్నాను. కొందరు దీన్ని ఓ సినిమాతో పోలిస్తే.. మరికొందరు ఇంకో సినిమాతో పోల్చి చూస్తున్నారు. నేను నమ్మకంగా చెబుతున్నా.. ఇది ప్రత్యేకమైన చిత్రం. దేనితోనూ పోల్చలేం. పా. రంజిత్ టేకింగ్ నాకు ఇష్టం. ఎక్కువగా సింగిల్ టేక్స్‌లోనే ఈ సినిమాని తెరకెక్కించారు. నటులకంటే ఆయనే బాగా కష్టపడ్డారు. ఈ చిత్రం నన్ను నటుడిగా మరో మెట్టు ఎక్కిస్తుందనుకుంటున్నా’’ అని పేర్కొన్నారు.‘‘నా కెరీర్‌లో ఈ సినిమా ప్రత్యేకమైంది. నేనిందులో ఆరతి పాత్ర పోషించా. చాలామంది నటులు తాము బాగా నటించామా, లేదా? అని చెక్ చేసుకుంటారంతే. విక్రమ్ మాత్రం ఆయా సన్నివేశాల్లో నటించే వారందరూ బాగా చేస్తున్నారా, లేదా? అని గమనిస్తారు. నటన విషయంలో ఇతరులకు సాయం చేస్తుంటారు’’ అని మాళవికా మోహనన్ కొనియాడారు. విక్రమ్‌తో కలిసి పని చేయడం గర్వంగా ఉందన్న పా. రంజిత్.. టీమ్ సహకారంతో అనుకున్న అవుట్‌పుట్ వచ్చిందన్నారు. కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ కార్మికుల జీవితాల ఆధారంగా రూపొందిన సినిమా ఇది.ప్రచారంలో భాగంగా ‘తంగలాన్’ టీమ్ తెలుగు రాష్ట్రాల్లోనూ ఇటీవల సందడి చేసింది. గుంటూరు వీవీఐటీ విద్యార్థులతో కలిసి విక్రమ్ డ్యాన్స్ చేయడం విశేషం. సంబంధిత వీడియో నెట్టింట వైరల్ అయింది.