తెలంగాణవీణ జాతీయం :బెంగళూరు ఇంట్లో కూర్చునే నచ్చిన రెస్టారంట్ల నుంచి ఆహారాన్ని తెప్పించుకొని ఆస్వాదిస్తోంది ఈ తరం. ఫుడ్ డెలివరీ యాప్స్ స్విగ్గీ, జొమాటో ప్రజలకు ఈ సౌకర్యాలను అందిస్తున్నాయి. ఈ ప్రయాణంలో స్విగ్గీ పదేళ్లు పూర్తి చేసుకుంది. దీనిని ఉద్దేశిస్తూ ఆ సంస్థ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ శ్రీహర్ష మాజేటి సామాజిక మాధ్యమాల్లో ఒక పోస్టు పెట్టారు. తన ఫస్ట్ డే గురించి వెల్లడించారు.‘‘ఆగస్టు 6, 2014లో మేం స్విగ్గీ)ని ప్రారంభించాం. ఫుడ్ ఆర్డర్ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూశాం. కానీ, మొదటిరోజు మాకు ఒక్క ఆర్డరూ రాలేదు. మరుసటి రోజు తొలి ఆర్డర్ అందుకున్నాం. అదే మా జర్నీలో అసలైన ప్రారంభానికి గుర్తు. మా తొలి భాగస్వాముల్లో ఒకటైన ట్రఫుల్స్ రెస్టారంట్ నుంచి ఆహారం కోసం మాకు రెండు ఆర్డర్లు వచ్చాయి. అప్పటి నుంచి వారితో మా భాగస్వామ్యం బలపడింది. ఒక దశలో ఒక్క రోజులో 7261 ఆర్డర్లు అందుకున్నాం’’ అని శ్రీహర్ష తన సంస్థ ఎదుగుదల గురించి వెల్లడించారు. ఫుడ్ డెలివరీ కాన్సెప్ట్ అప్పుడప్పుడే అందరికీ చేరువవుతోన్న తరుణంలో తమపై విశ్వాసం ఉంచిన రెస్టారంట్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం మూడు లక్షల రెస్టారంట్లతో కలిసి పనిచేస్తున్నామన్నారు. అది తమకెంతో గర్వకారణమని తెలిపారు. ఆ మద్దతే ప్రతి ఇంట్లో తమ పేరు వినిపించేందుకు కారణమైందన్నారు.బెంగళూరు కేంద్రంగా 2014లో స్విగ్గీ ప్రారంభమైంది. శ్రీహర్ష మాజేటి, నందన్ రెడ్డి, రాహుల్ భాగస్వామ్యంలో ఇది ఏర్పాటైంది. దాదాపు 600 భారత నగరాలకు దీని కార్యకలాపాలు విస్తరించాయి. నిత్యావసరాలను వేగవంతంగా సరఫరా చేసే సేవల విభాగం ఇన్‌స్టామార్ట్ స్విగ్గీలో భాగమే.