తెలంగాణవీణ సినిమా :ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ను ఉద్దేశించి నటి శ్రియ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాదులోని ఓ షాపింగ్‌మాల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆమె.. రానున్న రోజుల్లో పవన్‌కల్యాణ్ అద్భుతాలు సృష్టిస్తారని అన్నారు.‘‘ఇటీవల జరిగిన ఎన్నికల్లో పవన్‌కల్యాణ్ అద్భుతమైన విజయం అందుకున్నారు. ఆయన విషయంలో నేనెంతో గర్వంగా ఉన్నా. మేమిద్దరం గతంలో ‘బాలు’ కోసం కలిసి వర్క్ చేశాం. ఆయన చాలా సైలెంట్‌గా ఉంటారు. శ్రమపడే మనస్తత్వం కలిగిన వ్యక్తి. ఆ సినిమాలోని ఓ పాట చిత్రీకరణ సమయంలో ఆయన కాలికి గాయమైంది. పాట షూట్ పూర్తయ్యేవరకూ ఆ విషయాన్ని ఎవరితోనూ చెప్పలేదు. ప్రజలకు మంచి చేయాలని ఎప్పుడూ తాపత్రయపడేవారు. ప్రజలు ఆయన్ని ఎన్నుకోవడం సంతోషంగా ఉంది. ఆయన అద్భుతాలు సృష్టిస్తారని నేను నమ్ముతున్నా’’ అని శ్రియ తెలిపారు. చిరంజీవితో మరోసారి కలిసి వర్క్ చేయాలనుకుంటున్నానని చెప్పారు.ప్రస్తుతం తాను ‘షో టైమ్’ అనే కార్యక్రమం కోసం వర్క్ చేస్తున్నానని చెప్పారు. బాలీవుడ్‌లోనూ అవకాశాలు వస్తున్నాయన్నారు. తెలుగులో తేజ సజ్జా మూవీ కోసం యాక్ట్ చేస్తున్నానన్నారు. సినిమాకు ఇప్పుడు భాషతో సంబంధం లేదని.. కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు వీక్షిస్తున్నారని తెలిపారు. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్‌లో ఏ చిత్ర పరిశ్రమ అంటే ఇష్టమని విలేకరి ప్రశ్నించగా.. ఇండియన్ సినిమా అని చెప్పడం తనకు ఇష్టమన్నారు.