తెలంగాణవీణ జాతీయం : రెజ్లర్లు బరువు తగ్గించుకోవడంలో ఎదుర్కొనే కష్టాన్ని అర్థం చేసుకోగలనని పారిస్ ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలిచిన అమెరికా రెజ్లర్ సారా హిల్డర్‌బ్రాంట్ వెల్లడించింది. బుధవారం అర్ధరాత్రి (భారత కాలమానం ప్రకారం) జరిగిన ఫైనల్‌లో క్యూబా రెజ్లర్ గుజ్మన్ లోపేజ్‌పై విజయం సాధించిన సారా గోల్డ్‌ను కైవసం చేసుకుంది. లోపేజ్‌కు రజతం దక్కగా.. జపాన్ క్రీడాకారిణి సుసాకీ, చైనా రెజ్లర్ జికీ ఫెంగ్ కాంస్యాలు అందుకొన్నారు. ఈసందర్భంగా గోల్డ్ విన్నర్ సారా రెజర్ల బరువుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. వినేశ్ బాధను అర్థం చేసుకోగలనని పేర్కొంది. ‘‘వినేశ్ గొప్ప అథ్లెట్. అద్భుతమైన రెజ్లర్. ఆమెపై అనర్హత వేటు పడటం బాధాకరం. బరువు కోసం నేను కూడా చాలా చేశా. ఆమె కష్టాన్ని అర్థం చేసుకోగలను. ఈ వార్త తెలియగానే ఫైనల్‌లో తలపడకుండానే బంగారు పతకం వచ్చిందనుకున్నా. పారిస్ ఒలింపిక్స్‌లో విజేతగా నిలిచానని భావించా. కానీ, గంట వ్యవధిలోనే నా సంబరాలకు బ్రేక్ పడింది. ఫైనల్‌లో లోపేజ్‌తో తలపడాలని తెలిసింది. చివరికి విజేతగా నిలవడం ఆనందంగా ఉంది. నేను కూడా చాలా బరువు తగ్గాల్సి వచ్చింది. అందుకోసం తీవ్రంగా శ్రమించా. వినేశ్ విషయంలో ఇలా జరుగుతుందనుకోలేదు. సెమీస్‌లోనూ చాలా అద్భుతంగా ఆడింది. కానీ, ఆమెకు ఒలింపిక్స్ ఇలా ముగుస్తుందనుకోలేదు. మనస్ఫూర్తిగా వినేశ్‌కు నా మద్దతు తెలుపుతున్నా. ఆమె గొప్ప పోరాటయోధురాలు. రెజ్లర్‌గానే కాకుండా వ్యక్తిగతంగానూ మంచి మనిషి’’ అని సారా తెలిపింది.