తెలంగాణవీణ సినిమా : ధనుష్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రాయన్’. ఇటీవల ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ రికార్డులు సృష్టించింది. ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని సినిప్రియులంతా ఆసక్తిగా ఎదురుచూశారు. తాజాగా వారి ఎదురుచూపులకు ఫుల్‌స్టాప్ పెడుతూ ఈ హిట్ సినిమా ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఆగస్టు 23 నుంచి అమెజాన్ ప్రైమ్ వేదికగా ప్రసారం కానుంది. ఈ విషయాన్ని తెలుపుతూ నిర్మాణ సంస్థ ప్రత్యేక పోస్టర్ విడుదల చేసింది.రాయన్ కథేంటంటే: ఒక పేద కుటుంబానికి చెందిన రాయన్ (ధనుష్)కు ఇద్దరు తమ్ముళ్లు (సందీప్‌కిషన్, కాళిదాస్ జయరామ్), ఒక చెల్లి (దుషారా విజయన్). చిన్నప్పుడే తల్లిదండ్రులు దూరమవుతారు. టౌన్‌కి వెళ్లొస్తామని చెప్పి మళ్లీ తిరిగిరారు. ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలు రాయన్ చేత కత్తి పట్టిస్తాయి. భయపడకుండా పోరాటం చేయడం అప్పట్నుంచే అలవాటవుతుంది. తన తోబుట్టువులకు అన్నీ తానై, ముగ్గురినీ వెంట పెట్టుకొని టౌన్‌కి చేరుకుంటాడు రాయన్. ఓ మార్కెట్లో పనిచేస్తూ నలుగురూ అక్కడే పెరిగి పెద్దవుతారు. అక్కడ దురై (శరవణన్), సేతు (ఎస్.జె.సూర్య) గ్యాంగ్స్ మధ్య ఎప్పట్నుంచో ఆధిపత్య పోరాటం కొనసాగుతుంటుంది. ఆ గొడవలు రాయన్ కుటుంబాన్ని ఎలా ప్రభావితం చేశాయి? తన తమ్ముళ్లు, చెల్లెలు కోసం రాయన్ ఏం చేశాడు? రాయన్ కోసం వాళ్లు ఏం చేశారు? తదితర విషయాలన్నీ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.