Friday, September 20, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

రివ్యూ: తిరగబడరసామీ.. రాజ్‌తరుణ్‌ ఖాతాలో హిట్‌ పడిందా లేదా :

Must read

తెలంగాణవీణ సినిమా : చిత్రం: తిరగబడరసామీ..; నటీనటులు: రాజ్‌తరుణ్‌, మాల్వీ మల్హోత్ర, మన్నారా చోప్రా, రఘుబాబు తదితరులు; దర్శకత్వం: రవికుమార్‌ చౌదరి; విడుదల: 02-08-2024 గతవారం ‘పురుషోత్తముడు’ అంటూ పలకరించిన రాజ్‌తరుణ్ ఈ శుక్రవారం ‘తిరగబడరసామీ’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో రాజ్‌తరుణ్‌ వ్యక్తిగత జీవితం, వివాదాలు హాట్‌టాపిక్‌. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో బ్యాక్‌ టు బ్యాక్‌ వచ్చిన ఈ చిత్రం అతడికి విజయాన్ని అందించిందా?
క‌థేంటంటే: గిరి (రాజ్‌త‌రుణ్‌) చిన్న‌ప్పుడే అమ్మానాన్న‌ల‌కు దూర‌మ‌వుతాడు. అనాథ‌లా పెరిగి పెద్ద‌వుతాడు. త‌న‌లా కుటుంబాలకు దూర‌మైన వాళ్ల‌ని వెతికిప‌ట్టుకుని త‌ల్లిదండ్రుల‌కు అప్ప‌గించ‌డ‌మే ప‌నిగా పెట్టుకుంటాడు. అలా అత‌ని పేరు అంద‌రికీ తెలిసిపోతుంది. ఓ టీవీ ఇంట‌ర్వ్యూలో గిరిని చూసిన శైల‌జ (మాల్వి మ‌ల్హోత్రా) ద‌గ్గ‌ర‌వుతుంది. ఆ త‌ర్వాత ఇద్ద‌రూ ప్రేమ‌లో ప‌డ‌తారు. పెళ్లితో ఒక్క‌ట‌వుతారు. ఇంత‌లో కొండారెడ్డి (మ‌క‌రంద్ దేశ్‌పాండే) ముఠా శైల‌జ కోసం వేట మొద‌లుపెడుతుంది. గిరి గురించి తెలుసుకుని అత‌న్ని కూడా పిలిపించి శైల‌జ‌ని వెతికి పెట్టాల‌ని లేదంటే ప్రాణాల‌తో ఉండ‌వ‌ని బెదిరిస్తాడు. త‌న భార్య శైల‌జ రూ.2 వేల కోట్ల ఆస్తికి వార‌సురాలని తెలిశాక గిరి ఏం చేశాడు? ఇంత‌కీ శైల‌జకీ, కొండారెడ్డికీ సంబంధ‌మేమిటి? త‌న భార్య‌ని కాపాడుకోవ‌డం కోసం గిరి ఏం చేశాడు? త‌దిత‌ర విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే: ఒక‌వైపు వెబ్‌సిరీస్‌లు క‌ట్టి ప‌డేస్తున్నాయి. మ‌రోవైపు లార్జ‌ర్ దేన్ లైఫ్ త‌ర‌హా భారీ సినిమాలు థియేట‌ర్ల‌లో వారానికొక‌టి సంద‌డి చేస్తున్నాయి. వీటి మ‌ధ్య ప‌రిమిత వ్య‌యంతో కూడిన సినిమా చూడాలంటే అందులో ఏదో ప్ర‌త్యేక‌త ఉండి తీరాల్సిందే. క‌థ‌, క‌థ‌నాల్లో కొత్త‌ద‌నం.. హాస్య‌ం.. హృద్య‌మైన భావోద్వేగాలో ఇలా ప్రేక్షకుడిని కట్టిపడేయాల్సిన అంశం ఉండాలి. మూస‌ధోర‌ణిలో సాగే సినిమాల‌కైతే ఎప్పుడో మంగ‌ళం పాడేశాడు న‌వ‌త‌రం ప్రేక్ష‌కుడు. అది ప్ర‌తిసారీ రుజువ‌వుతున్నా ఇంకా ఆ త‌ర‌హా ప్ర‌య‌త్నాలు కొన‌సాగుతూనే ఉన్నాయి. ‘తిర‌గ‌బ‌డ‌ర సామీ’ కూడా ఆ తాను ముక్కే. ఊహ‌కు అందే క‌థ‌, క‌థ‌నాలతో ఏ ద‌శ‌లోనూ ఆస‌క్తిని రేకెత్తించ‌దు ఈ సినిమా.ప్రేక్ష‌కుడి మ‌న‌సును తాకే భావోద్వేగాలు, కాసేపు కాల‌క్షేపాన్నిచ్చే హాస్యం కానీ మ‌చ్చుకైనా క‌నిపించ‌వు. యువ జంట న‌టించిన సినిమా క‌దా, స‌ర‌దా స‌న్నివేశాలు, ప్రేమ నేప‌థ్యమేదైనా ఉంటుందేమో అని ఆశిస్తే అదీ భంగపాటే. కొండారెడ్డి ముఠా వేట‌, హీరో హీరోయిన్ల ప‌రిచ‌య స‌న్నివేశాలు, ఆ త‌ర్వాత ప్రేమ‌, పెళ్లి… ఇలా సాదాసీదాగా సాగుతుంది చిత్రం. విరామం ఎపిసోడ్ కూడా ప్రేక్ష‌కుడు ఊహించిందే. విరామం త‌ర్వాత శైల‌జ‌ని కొండారెడ్డి ముఠా నుంచి కాపాడుకోవ‌డం కోసం హీరో వేసే ఎత్తుగ‌డ‌లు, ఆమె నేప‌థ్యంతో సాగే కొన్ని స‌న్నివేశాలు ప‌ర్వాలేద‌నిపించినా, ఆ త‌ర్వాత మ‌ళ్లీ మామూలే. కొండారెడ్డి ముందుకెళ్లి హీరో ఎలా తిర‌గ‌బ‌డ్డాడ‌నేది ప‌తాక స‌న్నివేశాల్లో చూపించారు. రెండు గంట‌ల నిడివి కూడా లేని ఈ సినిమా, కాలం చెల్లిన క‌థ, పాత్ర‌లు, స‌న్నివేశాల‌తో ప్రేక్ష‌కుల స‌హ‌నానికి ప‌రీక్షలా అనిపిస్తుంది.ఎవ‌రెలా చేశారంటే: రాజ్‌త‌రుణ్, మాల్వి మ‌ల్హోత్రా జంట చుట్టూనే సాగే ఈ క‌థ‌లో ఆ ఇద్ద‌రూ పాత్ర‌ల‌కు న్యాయం చేశారు. రాజ్‌త‌రుణ్ ప్ర‌థ‌మార్ధంలో ప‌క్కింటి కుర్రాడిగా క‌నిపించినా, ద్వితీయార్ధంలో పోరాట ఘ‌ట్టాల‌తో త‌న‌లోని యాక్ష‌న్ కోణాన్ని చూపించాడు. ముఖ్యంగా పోలీస్ స్టేష‌న్‌లో సాగే స‌న్నివేశాలు, ప‌తాక స‌న్నివేశాలు ఆక‌ట్టుకుంటాయి. మాల్వి కూడా ఫైట్లు చేసింది. మ‌న్నారా చోప్రా వ్య‌తిరేక ఛాయ‌లున్న పాత్ర‌లో సంద‌డి చేసింది. ఆమె ప్ర‌త్యేక‌గీతంతోనూ సంద‌డి చేసింది. మ‌క‌రంద్ దేశ్‌పాండే విల‌నిజం పండ‌లేదు. ర‌ఘుబాబు, థ‌ర్టీ ఇయ‌ర్స్ పృథ్వీ, తాగుబోతు ర‌మేశ్‌, గీతాసింగ్‌, ప్ర‌గ‌తి, రాజా ర‌వీంద్ర త‌దిత‌రులున్నా ర‌ఘుబాబు మిన‌హా మిగ‌తావాళ్ల పాత్ర‌లు ప్ర‌భావం చూపించ‌వు. ర‌చ‌న‌లో బ‌లం లేదు. ద‌ర్శ‌కుడు కాలం చెల్లిన క‌థ‌తో చేసిన ఈ ప్ర‌య‌త్నం ఏ ద‌శ‌లోనూ మెప్పించ‌దు. నిర్మాణం సినిమా స్థాయికి త‌గ్గ‌ట్టుగా ఉంది.
బ‌లాలు

  • విరామం త‌ర్వాత కొన్ని స‌న్నివేశాలు
    బ‌ల‌హీన‌త‌లు
  • క‌థ‌, క‌థ‌నం
  • కొర‌వ‌డిన భావోద్వేగాలు
    చివ‌రిగా: తిర‌గ‌బ‌డ‌రా సామీ… ఇది అరిగిపోయిన పాత కథే సామీ
    గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you