తెలంగాణవీణ జాతీయం : అధికార దుర్వినియోగం, తప్పుడు ధ్రువీకరణ పత్రాల సమర్పణ వ్యవహారంలో ఆ మధ్య ఐఏఎస్ మాజీ ప్రొబేషనరీ అధికారిణి పూజా ఖేడ్కర్ పేరు మీడియాలో చక్కర్లు కొట్టింది. ప్రస్తుతం ఆమె కేసు దిల్లీ హైకోర్టు పరిధిలో ఉంది. కోర్టు విచారణలో యూపీఎస్సీ చేసిన వాదనలను పూజ తోసిపుచ్చారు. తాను ఏ పత్రాలను ఫోర్జరీ చేయలేదని తెలిపారు. యూపీఎస్సీకి తనపై అనర్హత వేటువేసే అధికారం లేదని వాదించారు. ‘‘డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్‌కు మాత్రమే అఖిల భారత సర్వీసుల చట్టం కింద చర్యలు తీసుకునే వీలు ఉంది’’ అని ఆమె తన వాదన వినిపించారు.పుణెలో ట్రైనీ సహాయ కలెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న సమయంలో పూజా ఖేడ్కర్‌పై అధికార దుర్వినియోగంతో పాటు యూపీఎస్సీలో తప్పుడు అఫిడవిట్ పత్రాలు సమర్పించారనే ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టిన యూపీఎస్సీ .. ఆమెను ముస్సోరిలోని లాల్‌బహదూర్ శాస్త్రి జాతీయ అకాడమీకి తిరిగి రావాలని ఆదేశించింది. నకిలీ పత్రాలతో పరీక్షను క్లియర్ చేసినట్లు గుర్తించిన యూపీఎస్సీ దానిపై వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీసులిచ్చింది. ఆమెపై ఫోర్జరీ కేసు నమోదు చేయడంతో పాటు అభ్యర్థిత్వాన్ని రద్దు చేసింది. దీనిపై ఆమె హైకోర్టును ఆశ్రయించారు. తనపై వచ్చిన ఆరోపణలపై సమాధానం ఇచ్చే వరకు అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని ఆమె కోర్టును అభ్యర్థించారు. దాంతో ఆమెకు ఆగస్టు 29 వరకు రక్షణ లభించింది. ఈ క్రమంలో తాజాగా విచారణ జరిగింది.