తెలంగాణవీణ జాతీయం : మహారాష్ట్రకు చెందిన ఐఏఎస్ మాజీ ప్రొబేషనరీ అధికారిణి పూజా ఖేడ్కర్ ఆచూకీ తెలియడం లేదు. మోసం, ఫోర్జరీ కేసులో ఆమెకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు దిల్లీ కోర్టు గురువారం నిరాకరించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అరెస్టు భయంతో ఆమె దుబాయ్ కి పరారైనట్లు తెలుస్తోంది. ఈమేరకు పలు ఆంగ్ల మీడియాల్లో కథనాలు వెలువడుతున్నాయి.పుణెలో ట్రైనీ సహాయ కలెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న సమయంలో పూజా ఖేడ్కర్‌పై అధికార దుర్వినియోగంతో పాటు యూపీఎస్సీలో తప్పుడు అఫిడవిట్ పత్రాలు సమర్పించారనే ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టిన యూపీఎస్సీ .. జులై 23లోగా ఆమెను ముస్సోరిలోని లాల్‌బహదూర్ శాస్త్రి జాతీయ అకాడమీకి తిరిగి రావాలని ఆదేశించింది. ఆమె అకాడమీకి వెళ్లలేదు సరికదా అప్పటినుంచి పూజ ఫోన్లు స్విచ్చాఫ్ వస్తున్నట్లు సదరు కథనాలు వెల్లడించాయి. గత రెండు వారాల నుంచి ఆమె ఎక్కడుందనే దానిపై ఎలాంటి సమాచారం లేదు.పూజా ఖేడ్కర్ ముందస్తు బెయిల్ తిరస్కరణఈ క్రమంలోనే ఫోర్జరీ, చీటింగ్ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ పూజా ఖేడ్కర్ తరఫున ఆమె న్యాయవాది దిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. బెయిల్ ఇచ్చేందుకు తిరస్కరించింది. అయితే, ఈ ఉత్తర్వులు రావడానికి ముందే ఆమె దుబాయ్‌కి వెళ్లిపోయినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. తాజా కథనాల నేపథ్యంలో దిల్లీ పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. ఆమె పరారైనట్లు వస్తున్న వార్తలు నిజమేనని తేలితే పూజ కోసం అంతర్జాతీయ సంస్థల సహకారం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.నకిలీ పత్రాలతో పరీక్షను క్లియర్ చేసినట్లు గుర్తించిన యూపీఎస్సీ దానిపై వివరణ ఇవ్వాలని పూజా ఖేడ్కర్‌కు షోకాజ్ నోటీసులిచ్చింది. దీనిపై ఆమె నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో అభ్యర్థిత్వాన్ని రద్దు చేసింది. భవిష్యత్తులో యూపీఎస్సీకి చెందిన ఎలాంటి పరీక్షలు రాయకుండా శాశ్వత నిషేధం విధించింది.