తెలంగాణవీణ సినిమా : ‘గబ్బర్‌సింగ్’ తర్వాత హీరో పవన్‌కల్యాణ్ దర్శకుడు హరీశ్ శంకర్ కాంబినేషన్‌లో రానున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్‌సింగ్. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై ఇది నిర్మితం కానుంది. ఈ చిత్రానికి తొలుత ‘భవదీయుడు భగత్‌సింగ్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ పేరును ‘ఉస్తాద్ భగత్‌సింగ్’గా మార్చారు. సినిమా పేరు మార్చడానికి గల కారణాన్ని తాజాగా హరీశ్ శంకర్ తెలియజేశారు.‘‘భవదీయుడు భగత్‌సింగ్’ అని టైటిల్ అనౌన్స్ చేసినప్పుడు చాలామందికి అది సరిగ్గా అర్థం కాలేదు. భగత్ సింగ్ అంటే ఒక విస్ఫోటనం. భవదీయుడులో ఒక వినయం, భగత్‌సింగ్‌లో ఒక విస్ఫోటనం ఉంది. టైటిల్ చాలా బాగుంది ఫిక్స్ చేసేయ్ అని టైటిల్ విన్న వెంటనే పవన్‌కల్యాణ్ చెప్పారు. ఆ టైటిల్ ప్రకటించిన తర్వాత చాలామందికి అది కనెక్ట్ కాలేదు. స్క్రిప్ట్ కూడా కాస్త మారింది. హీరో క్యారెక్టరైజేషన్ మాత్రం అలాగే ఉంటుంది. ఆ భగత్ సింగ్ దేశం కోసం ప్రాణం ఇచ్చాడు. అవసరమైతే ఈ భగత్ సింగ్ దేశం కోసం ప్రాణం తీస్తాడు. ఈ రోజుల్లో అలాంటి భగత్‌సింగ్ కాకుండా ఇలా ఉండాలనే సందేశంతో ఆ టైటిల్ పెట్టాం’’ అని ఆయన తెలిపారు.అనంతరం ఆయన సోషల్‌మీడియాలో వచ్చే విమర్శల గురించి మాట్లాడారు. వివరణాత్మక, నిర్మాణాత్మక విమర్శలను తాను స్వాగతిస్తానని చెప్పారు. అయితే కొంతమంది తన కుటుంబసభ్యులను దూషిస్తుంటారని అలాంటి కామెంట్స్‌ను తాను ఏమాత్రం అంగీకరించనని తెలిపారు. అలాంటి మాటలు అనేవారిపై తాను సీరియస్ అవుతానని చెప్పారు. ‘ఉస్తాద్ భగత్‌సింగ్’లో పవన్‌కల్యాణ్ పవర్‌ఫుల్ పోలీస్ అధికారిగా కనిపించనున్నారు. శ్రీలీల కథానాయిక. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు అందిస్తున్నారు.