తెలంగాణవీణ హైదరాబాద్ : కోల్‌కతాలో వైద్యురాలిపై హత్యాచార ఘటనకు నిరసనగా దేశవ్యాప్తంగా వైద్యుల ఆందోళన కొనసాగుతోంది. వైద్య సేవలు నిలిపివేసి వైద్యులు నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. వైద్యురాలిపై అఘాయిత్యానికి నిరసనగా ఐఎంఏ 24 గంటల బంద్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో కోల్‌కతా, దిల్లీ, హైదరాబాద్ సహా ప్రధాన నగరాల్లో వైద్యులు నిరసనకు దిగారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ నుంచి క్లాక్ టవర్ వరకు వైద్యులు ర్యాలీ చేపట్టారు. నిమ్స్ ఆస్పత్రిలో అత్యవసర సేవలు మినహా మిగతా సేవలను నిలిపివేశారు. వైద్యులకు రక్షణ కల్పించాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. వైద్య సిబ్బంది కోసం కొత్త చట్టం తేవాలని కోరారు. ఆదివారం ఉదయం 6 గంటల వరకు వైద్యుల నిరసన కొనసాగనుంది.