తెలంగాణవీణ జాతీయం : పారిస్ ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన అర్షద్ నదీమ్ పాకిస్థాన్‌లో హీరో అయిపోయాడు. అతడు అవార్డులు, రివార్డులు దక్కించుకున్నాడు. నదీమ్ ప్రతిభకు గుర్తింపుగా అత్యున్నత పౌర పురస్కారంతో సత్కరించాలని పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీ ప్రభుత్వానికి సిఫార్సు చేస్తూ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. పారిస్ నుంచి స్వదేశానికి చేరుకున్న అతడికి ఘనస్వాగతం లభించింది. తన తల్లిని భుజాలపైకి ఎత్తుకొని భావోద్వేగానికి గురయ్యాడు. మీడియాతో మాట్లాడుతూ కీలక విషయాలను వెల్లడించాడు. ఈ సందర్భంగా భారత అథ్లెట్ నీరజ్ చోప్రా తల్లి చేసిన వ్యాఖ్యలపైనా స్పందించాడు. ‘‘అమ్మ ప్రతి ఒక్కరికీ అమ్మే. అందరి కోసం ప్రార్థిస్తుంది. నీరజ్ చోప్రా తల్లికి ధన్యవాదాలు చెబుతున్నా. ఆమె నాకూ తల్లే. దక్షిణ ఆసియా నుంచి మేమిద్దరమే (నీరజ్) ప్రపంచ వేదికపై మా సత్తా చాటేందుకు వెళ్లాం’’ అని నదీమ్ పేర్కొన్నాడు. నదీమ్ కూడా తన కొడుకులాంటి వాడేనని ఇటీవల నీరజ్ తల్లి సరోజ్ దేవి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.మా ఊరికి రోడ్లు వేయండిపాక్ ప్రభుత్వానికి అర్షద్ నదీమ్ తన గ్రామం కోసం ఓ విజ్ఞప్తి చేశాడు. గ్రామస్థుల సహకారంతో అంతర్జాతీయ స్థాయికి వెళ్లిన నదీమ్ వారికోసం ఏదైనా చేయాలని సంకల్పించాడు. ‘‘మా గ్రామంలో రోడ్లు వేయాల్సిన అవసరం ఉంది. వంట గ్యాస్ సరఫరా కూడా సరిగా లేదు. ఆ సదుపాయం కల్పిస్తే నాతోపాటు మా గ్రామానికి చాలా ఉపయోగం. మియాన్ చాన్నులో ఓ యూనివర్సిటీ రావాలనేది నా కల. మా సోదరీమణులు వేరే సిటీకి వెళ్లి చదువుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. ముల్తాన్‌కు వెళ్లాలంటే కనీసం రెండు గంటలపాటు ప్రయాణించాలి. అదే ఒక యూనివర్సిటీ మాకు దగ్గరగా ఉంటే చాలామంది గ్రామీణులకు ఉపయోగకరం. క్రీడాకారులకు మద్దతుగా నిలుస్తున్న పాక్ ప్రభుత్వానికి ధన్యవాదాలు చెబుతున్నా. గ్రామంలోని ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు. ఈ విజయం వెనుక వారందరి పాత్ర ఉంది. ఈవెంట్ల కోసం వెళ్లేందుకు సహకారం అందించారు. తప్పకుండా గ్రామస్థుల రుణం తీర్చుకొనేందుకు ప్రయత్నిస్తా’’ అని నదీమ్ వ్యాఖ్యానించాడు. పారిస్ నుంచి స్వదేశానికి చేరుకున్న అతడికి ఘన స్వాగతం లభించింది. ఈ ఒలింపిక్స్‌లో పాక్‌కు ఒకే ఒక్క పతకం వచ్చింది. అదీనూ నదీమ్ సాధించిన గోల్డ్ కావడం గమనార్హం.నదీమ్‌కు ప్రత్యేక బహుమానం..ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలిచిన తన అల్లుడికి నదీమ్ మామ మహమ్మద్ నవాజ్ ప్రత్యేకంగా ఓ బహుమతిని అందజేశారు. అత్యంత విలువైన గేదెను అతడికి ఇచ్చినట్లు నవాజ్ తెలిపారు. దీనిని గౌరవంగా భావిస్తామని వెల్లడించారు. నవాజ్‌కు ముగ్గురు కుమార్తెలు, నలుగురు కుమారులు. అందులో చిన్న కుమార్తెను నదీమ్ వివాహం చేసుకున్నాడు. ఈ జంటకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.