తెలంగాణవీణ హైదరాబాద్ : నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ఉద్ధృతి కొనసాగుతోంది. దీంతో మొత్తం 26 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. 22 గేట్లు 5 అడుగులు, 4 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి నీటిని విడిచి పెడుతున్నారు. ప్రాజెక్టుకు 2.53 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది. 2.69 లక్షల క్యూసెక్కుల ఔట్‌ఫ్లోను దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 585.30 అడుగులుగా ఉంది. పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 312.50 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ 298.30 టీఎంసీలుగా నమోదైంది. కూలిపోయిన సుంకిశాల రిటెయినింగ్ వాల్ నాగార్జునసాగర్ వద్ద సుంకిశాల రిటెయినింగ్ వాల్ కూలిపోయింది. ఆగస్టు 1న జరిగిన ఈ ఘటనను అధికారులు గోప్యంగా ఉంచారు. కార్మికులు షిఫ్టు మారే సమయంలో ఈ ఘటన జరగడంతో పెను ప్రమాదం తప్పింది. సుంకిశాల రిటెయినింగ్ వాల్ కూలడంతో పంప్ హౌస్ క్షణాల్లో జల దిగ్బంధమైంది. హైదరాబాద్‌లో తాగునీటి అవసరాల కోసం సుంకిశాల పథకం చేపట్టారు. సొరంగాల్లోకి జలాలు రాకుండా రక్షణగా రిటెయినింగ్ వాల్ నిర్మించారు. సాగర్ జలాశయం డెడ్ స్టోరేజీ నుంచి జలాల తరలింపునకు సుంకిశాల పథకం చేపట్టారు.