తెలంగాణవీణ జాతీయం : దేశ రాజధాని దిల్లీలో భారీ వర్షాలు మరో కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపాయి. మూడేళ్లు కూడా నిండని ఓ పసివాడు తల్లితో సహా ప్రాణాలు కోల్పోయాడు. వానల ధాటికి జలమయంగా మారిన మురుగుకాల్వ వారిని కబళించింది. జాతీయ మీడియా కథనాల ప్రకారం..దిల్లీకి చెందిన తనూజ బిష్త్.. వారపుసంతలో కూరగాయలు కొనేందుకు తన మూడేళ్ల కుమారుడితో కలిసి బయటకువచ్చారు. ఇంటికి తిరిగివస్తుండగా వర్షం ప్రారంభమైంది. భారీ వాన కారణంగా రోడ్డంతా నీట మునిగింది. దాంతో కాలువను గమనించలేకపోయిన తనూజ, ఆమె కుమారుడు దానిలోకి జారిపోయారు. కొన్ని గంటల తర్వాత 500 మీటర్ల దూరంలో వారు విగతజీవులుగా కనిపించారు. ఆ దృశ్యాన్ని చూసి ప్రతిఒక్కరి కళ్లు చెమర్చాయి. మరణంలోనూ ఆమె కుమారుడి చేయిని పట్టుకొని ఉండటం చూసి అక్కడ ఉన్నవారి మనసులు కళుక్కుమన్నాయి. ఈ మరణవార్త తెలిసిన తనూజ కుటుంబం కన్నీరుమున్నీరైంది. స్థానిక యంత్రాంగం నిర్లక్ష్య వైఖరిపై ఆక్రోశం వెళ్లగక్కింది. అధికారులు వెంటనే స్పందించి ఉంటే వారు బతికేవారని వాపోయింది.వయనాడ్ విషాదం.. మట్టిదిబ్బల కిందే ఇంకా 240 మంది ఈ ఘటన జరిగిన సమయంలో తనూజ భర్త గోవింద్ సింగ్ తన ఉద్యోగ విధుల్లో ఉన్నారు. ప్రతి ఏడాది ఇలాంటి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నా.. ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘‘మాకు రాత్రి 7.30 గంటల సమయంలో ఈ విషయం తెలిసింది. వెంటనే 100 నంబర్‌కు ఫోన్ చేశాం. పోలీసులు, సహాయక సిబ్బంది వచ్చినప్పటికీ.. వారివద్ద తగిన పరికరాలు లేవు. వారు ప్రయత్నించినప్పటికీ, ప్రయోజనం లేకపోయింది. రెండు గంటల తర్వాత వారి మృతదేహాలను వెలికితీశారు. చిన్న ఆశతో వారిని ఆసుపత్రికి తరలించే సమయంలో అంబులెన్స్ కూడా అందుబాటులో లేదు. మరణంలోనూ ఆమె తన కుమారుడి చేయిని పట్టుకొనే ఉంది’’ అని మృతురాలి బంధువు ఒకరు ఆవేదన వ్యక్తంచేశారు.ఇటీవలే బేస్‌మెంట్‌లోకి వరద నీరు చేరడంతో ముగ్గురు సివిల్స్ విద్యార్థులు మృతి చెందిన ఘటన మరువకముందే ఈ మరణాలు సంభవించడం దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ నిర్లక్ష్యానికి అద్దం పడుతోందనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ‘‘ఈ డ్రెయిన్ గత మూడు నెలలుగా తెరిచే ఉందని స్థానికులు విమర్శించారు. ‘‘20 ఏళ్లుగా నేను ఈ ప్రాంతంలోనే నివసిస్తున్నాను. ప్రతీ వర్షాకాలంలో రోడ్లు నీట మునుగుతాయి. ఈ సమస్య పరిష్కారానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర అధికారుల్ని కలిసినా ప్రయోజనం లేకపోయింది. డ్రెయిన్ నిర్మాణంలో ఉంటే.. దానిని గుర్తించేలా చర్యలు తీసుకోవడం యత్రాంగం బాధ్యత. వరద నీరు ఎక్కువగా ఉండటంతో ఆ మహిళ దానిని గుర్తించలేక అకారణంగా బలై పోయింది’’ అని స్థానిక వ్యక్తి ఒకరు పేర్కొన్నారు. నిన్న కురిసిన వర్షాలకు 9 మంది మృతిచెందారు. ప్రభుత్వం ఈ రోజు అన్ని పాఠశాలలకు సెలవు ఇచ్చింది. వాతావరణ విభాగం దిల్లీకి రెడ్ అలర్ట్ జారీ చేస్తూ.. ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని సూచించింది.