తెలంగాణవీణ జాతీయం : ఒలింపిక్స్‌లో భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ పై అనర్హత వేటు పడిన సంగతి తెలిసిందే. ఫైనల్ పోరులో పసిడి పతకం సాధిస్తుందన్న ఆశల వేళ ఈ వార్త కోట్లాది మంది భారతీయుల హృదయాలను ముక్కలు చేసింది. ఈ క్రమంలోనే అనర్హతపై ప్రధాని మోదీ స్పందిస్తూ వినేశ్‌ను ఓదార్చారు.‘‘వినేశ్.. నువ్వు ఛాంపియన్లకే ఛాంపియన్! నీ ప్రతిభ దేశానికి గర్వకారణం. భారతీయులందరికీ నువ్వు స్ఫూర్తిదాయకం. ఈ రోజు నీకు తగిలిన ఎదురుదెబ్బ ఎంతో బాధించింది. దీన్ని వ్యక్తం చేయడానికి నా దగ్గర మాటల్లేవు. కానీ, ఈ బాధ నుంచి బయటపడి నువ్వు బలంగా తిరిగి రాగలవని నేను నమ్ముతున్నా. సవాళ్లను ఎదిరించడం నీ నైజం. నీకు మేమంతా అండగా ఉన్నాం’’ అని మోదీ భరోసానిచ్చారు.భారత్‌కు షాక్.. రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌పై అనర్హత వేటు పీటీ ఉషకు మోదీ ఫోన్..తాజా పరిణామాల వేళ భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉషతో ప్రధాని మోదీ ఫోన్‌లో మాట్లాడినట్లు తెలుస్తోంది. వినేశ్‌పై అనర్హతకు దారి తీసిన పరిస్థితులపై ఆరా తీసిన ప్రధాని.. దీన్ని సవాల్ చేసేందుకు భారత్‌కు ఉన్న అవకాశాల గురించి అడిగి తెలుసుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. వినేశ్‌కు ఉపయోగపడుతుందనుకుంటే అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ వద్ద భారత్ నిరసనను బలంగా వ్యక్తపర్చాలని పీటీ ఉషకు సూచించినట్లు సమాచారం. ఒలింపిక్స్ మహిళల 50 కేజీల విభాగంలో వినేశ్ ఫైనల్‌కు చేరిన సంగతి తెలిసిందే. బుధవారం రాత్రి ఈ మ్యాచ్ జరగాల్సి ఉండగా.. ఈ ఉదయం పోటీదారుల బరువును పరీక్షించారు. ఇందులో ఆమె కొన్ని గ్రాముల అదనపు బరువు ఉండటంతో అనర్హత వేటు పడింది. దీంతో పతకం చేజారింది.