తెలంగాణవీణ జాతీయం :పారిస్ ఒలింపిక్స్‌లో భారత యువ షూటర్ మను బాకర్ రెండు పతకాలు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. గురువారం నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా 2018లో జరిగిన కామన్‌వెల్త్ గేమ్స్‌లో బంగారు పతకం గెలిచినప్పుడు, టోక్యో ఒలింపిక్స్‌లో చేదు అనుభవం ఎదురైన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీతో వ్యక్తిగతంగా జరిగిన సంభాషణలను ఆమె పంచుకుంది. అదేవిధంగా క్రీడాకారులపై ఆయనకు ఉన్న అభిమానాన్ని కొనియాడింది. 2018లో జరిగిన కామన్‌వెల్త్ గేమ్స్‌లో మను బాకర్ బంగారు పతకం సాధించింది. ఆ సమయంలో మొదటిసారిగా ప్రధాని నరేంద్ర మోదీని కలిసే అవకాశం లభించింది. ఆ సమయంలో మోదీ పంచుకున్న విషయాలను వెల్లడించింది.‘నువ్వు ఇంకా చిన్నదానివి. భవిష్యత్తులో మరిన్ని విజయాలు మీరు అందుకుంటారు. మీకు ఏ అవసరం ఉన్నా నన్ను కలవచ్చు’ అని మోదీ పేర్కొన్నారని తెలిపింది. ఇక, టోక్యో ఒలింపిక్స్‌లో ఎదురైన చేదు అనుభవం సమయంలో ఆయన మాటలు తనకు ఎంతో ప్రాత్సాహం ఇచ్చాయని, ఆ ప్రోత్సాహంతోనే తన భవిష్యత్తుకు ప్రణాళిక మొదలయ్యిందని మను పేర్కొంది. తన లక్ష్యంపై దృష్టి సారించాలని ఆయన సూచించారని వివరించింది. అదేవిధంగా ఆయన ప్రతి అథ్లెట్ గురించి ఎంతో శ్రద్ధ తీసుకుంటారని కొనియాడింది. విజయాలకు సంబరాలు చేసుకోవడంతో పాటు ఫలితాలతో సంబంధం లేకుండా ప్రతి క్రీడాకారుడితో ఆప్యాయంగా మాట్లాడతారని వివరిచింది. అందరితో వ్యక్తిగతంగా చర్చించి.. వారి సమస్యలు తెలుసుకుని వారిని ప్రోత్సహిస్తారని వెల్లడించింది. అయితే, టోక్యో ఒలింపిక్స్ సమయంలో భారత్ తరఫున బరిలో నిలిచిన మను బాకర్‌కు నిరాశ ఎదురైంది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ క్వాలిఫికేషన్ మధ్యలో ఆమె పిస్టల్ మొరాయించడంతో.. పోటీ నుంచి బయటకు రావాల్సి వచ్చింది. దీంతో ఫైనల్‌కు చేరుకోలేకపోయింది. అయితే ఇటీవల జరిగిన పారిస్ ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించి అరుదైన ఘనత సాధించింది.