తెలంగాణేవీణా ఏపీ బ్యూరో : న్యూస్‌టుడే: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై కూటమి ప్రభుత్వానికి సమయం ఇవ్వాలని వైకాపా నేత, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి సూచించారు. అధికారంలోకి వచ్చిన రెండు నెలలైనా కాకముందే పథకాలు ఇవ్వడం లేదంటూ గగ్గోలు పెట్టడం సరికాదన్నారు. ఈ తక్కువ సమయంలోనే అద్భుతాలు జరిగిపోతాయని భావించడం మూర్ఖత్వం అవుతుందన్నారు. సంపదను సృష్టించి సంక్షేమ పథకాలు అందిస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు చెప్పారన్నారు. అందుకోసం కనీసం ఒక ఆర్థిక సంవత్సరమైనా సమయం ఇవ్వాలన్నారు. వెంకట్రామిరెడ్డి బుధవారం తన యూట్యూబ్ ఛానెల్‌లో ఈ మేరకు వీడియో విడుదల చేశారు. అందులో ఆయన మాట్లాడుతూ… మద్యం, ఇసుక విక్రయాలు చేయడం వల్లే వైకాపా ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చిందని చెప్పారు. అన్ని పథకాల్నీ అమలు చేసినా వైకాపా 11 సీట్లే వచ్చాయన్నారు. తాను ప్రజల్లో ఎక్కువగా తిరిగానని, జనం దగ్గరికి తానే వెళ్లి పనులు చేసినా నిందలు, ఓటమి తప్ప ఏమీ మిగల్లేదన్నారు. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అని జగన్ పదేపదే చెప్పడంతో మిగతా వర్గాలు ఆయనకు దూరమయ్యాయని వివరించారు.