తెలంగాణవీణ జాతీయం :కోల్‌కతా వైద్య విద్యార్థినిపై హత్యాచారానికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున విద్యార్థులు ఆందోళన చేపడుతున్నారు. బుధవారం 12 గంటల పాటు పశ్చిమబెంగాల్ బంద్‌కు భాజపా ఇచ్చిన పిలుపు పలుచోట్ల ఉద్రిక్తతలకు దారితీసింది. కాగా ఈ విషయంపై మృతురాలి తల్లి స్పందించారు. ఈ నిరసనలకు వ్యతిరేకంగా బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యలను ఆమె ఖండించారు. ‘‘మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు నాకు నచ్చలేదు. నా కూతురిపై జరిగిన అఘాయిత్యానికి వ్యతిరేకంగా వాళ్లంతా న్యాయం కోసం పోరాడుతున్నారు. నిందితులకు శిక్ష పడేవరకు విద్యార్థులు విశ్రమించరు. ఈ విషయంలో ప్రపంచం మొత్తం నా కూతురికి అండగా నిలుస్తోంది. కన్నబిడ్డను కోల్పోయిన బాధలో ఉన్న మమ్మల్ని మమత చేసిన వ్యాఖ్యలు మరింత బాధించాయి. ఆమెకు పిల్లలు లేరు. అందుకే వారిని కోల్పోతే ఆ బాధ ఎలా ఉంటుందో తెలియదు’’ అని పేర్కొన్నారు.బుధవారం తృణమూల్ కాంగ్రెస్ ఛాత్ర పరిషత్ (విద్యార్థి విభాగం) ఆవిర్భావ దినోత్సవంలో సీఎం మమతా బెనర్జీ ప్రసంగించారు. అత్యాచార నిందితులకు మరణ శిక్ష విధించేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు శనివారం నుంచి రాష్ట్రస్థాయిలో తృణమూల్ పార్టీ ఉద్యమం చేపడుతుందని ప్రకటించారు. ఆందోళన చేపట్టిన జూనియర్ వైద్యులు వెంటనే విధుల్లో చేరాలని ఆమె కోరారు. గురువారం మమత ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ఆందోళనలో పాల్గొన్న విద్యార్థులపై ప్రభుత్వం ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని అందులో పేర్కొన్నారు. వారిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తే విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతుందని, విదేశాలకు వెళ్లి చదువుకోవడానికి పాస్‌పోర్ట్, వీసా కూడా లభించదని వ్యాఖ్యానించారు. బెంగాల్‌లో అశాంతి చెలరేగితే అస్సాం, ఈశాన్యం, ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, ఝార్ఖండ్, ఒడిశా, దిల్లీలపైనా దాని ప్రతికూల ప్రభావం ఉంటుందని ఆమె హెచ్చరించారు.కాగా ఈ కేసులో హత్యాచారం జరిగిన అనంతరం ఆర్జీ కర్ ఆసుపత్రి వర్గాలు బాధితురాలి తల్లిదండ్రులను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నాలు చేసినట్లుగా మూడు ఆడియో కాల్స్ తాజాగా బహిర్గతమయ్యాయి. ఉద్దేశపూర్వకంగానే మృతురాలి తల్లిదండ్రులకు తప్పుడు సమాచారం ఇచ్చారనే వాదనలు వ్యక్తమవుతున్నాయి.
మమతకు పిల్లలుంటే ఆ బాధ తెలిసేది కోల్‌కతా వైద్యురాలి తల్లి ఆవేదన:
