తెలంగాణవీణ సినిమా :ఆమిర్‌ఖాన్) కథానాయకుడిగా అషుతోశ్ గోవారికర్ దర్శకత్వంలో రూపొందిన పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా ‘లగాన్’ 2001లో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా, అనేక అవార్డులను సొంతం చేసుకుంది. భువన్‌గా ఆమిర్ నటన అందరినీ కట్టిపడేసింది. అయితే, తొలుత ఈ మూవీ స్క్రిప్ట్ అగ్ర కథానాయకులైన షారుక్, హృతిక్ రోషన్‌ల దగ్గరకు వెళ్లిందట. ఇందులో లఖా పాత్ర పోషించిన యశ్‌పాల్ శర్మ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.‘లగాన్’ కథ, స్క్రిప్ట్‌ను ఎవరూ నమ్మలేదని, కచ్చితంగా ఫ్లాప్ అవుతుందనుకున్నారని యశ్‌పాల్ అన్నారు. ‘‘జావేద్ అక్తర్‌తో సహా ప్రతి ఒక్కరూ ‘లగాన్’ సబ్జెక్ట్ వర్కవుట్ కాదనుకున్నారు. గ్రామీణ నేపథ్యంలో సాగే కథలో చేసేందుకు ఎవరూ ఆసక్తి చూపలేదు. ముఖ్యంగా హీరో ధోతి, పగ్డీ ధరించడం నచ్చలేదు. అషుతోష్ దగ్గర ఈ స్క్రిప్ట్ ఎప్పటి నుంచో ఉంది. ఆయన ఈ కథను సెట్స్‌పైకి తీసుకురావడానికి చాలా కష్టపడ్డారు. ఈ ప్రాజెక్ట్ కోసం షారుక్‌ను కలిశారు. అయితే, స్క్రిప్ట్ ఆయన్ను మెప్పించలేదు. ఆ తర్వాత హృతిక్ రోషన్‌ను కలిసి కథ చెప్పినా, ఆయన కూడా అంగీకారం తెలపలేదు. తీరా చూస్తే, సినిమాను ప్రేక్షకులు ఆదరించారు. ఆస్కార్‌కు కూడా నామినేట్ అయింది. సినిమా విజయం సాధించడం, ఆస్కార్‌కు నామినేట్ కావడంతో మేమంతా అమెరికా వెళ్లాం. సరిగ్గా అదే సమయంలో 9/11 ట్విన్ టవర్స్‌పై దాడి జరిగింది. దాదాపు నెల రోజుల పాటు అమెరికాలోనే ఉండిపోవాల్సి వచ్చింది’’ అని యశ్ పాల్ చెప్పుకొచ్చారు.షారుక్, హృతిక్‌లే కాదు, ఆమిర్‌ఖాన్ కూడా ‘లగాన్’ మూవీని మొదట రిజెక్ట్ చేశారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ‘‘లగాన్’ కథ ఐదు నిమిషాలు చెప్పారు. వెంటనే రిజెక్ట్ చేశా. ‘ఒక వైపు వర్షాలు పడక, మరోవైపు భూమి పన్ను కట్టలేని ప్రజలు బ్రిటిష్ వాళ్లతో క్రికెట్ ఆడతారా? ఇదేం వింత స్టోరీ’ అని అన్నాను. ఇది కాకుండా ఇంకేదైనా కథ ఉంటే చెప్పమని అడిగాను. అయితే, అషుతోష్ పూర్తి స్క్రిప్ట్‌తో వచ్చి నన్ను కలిశారు. కథ మొత్తం విన్న తర్వాత అస్సలు నమ్మలేకపోయా. ‘అద్భుతమైన స్క్రిప్ట్. సినిమా రికార్డులను బద్దలు కొడుతుంది. అయితే సినిమా చేసేందుకు భయంగా ఉంది. చేయలేను’ అని చెప్పాను. ఇదే కథను అషుతోష్ నా తల్లిదండ్రులకు చెబితే వాళ్లు భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకోవడమే కాదు, ‘ఈ సినిమా నువ్వు చేయాల్సిందే’ అని నాతో అన్నారు’’ అని ఆమిర్ ‘లగాన్’ వెనుక కథను పంచుకున్నారు.