తెలంగాణవీణ జాతీయం : భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీకి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ వీడియోలో 52 ఏళ్ల కాంబ్లీ నడవలేని స్థితిలో కనిపించాడు. ఏదో పని మీద బయటికొచ్చిన అతడు ఓ షాప్ ముందు ఉన్న బైక్‌ని పట్టుకుని నిల్చున్నాడు. ఆ షాప్‌లోకి వెళ్లడానికి కాంబ్లీ ప్రయత్నించాడు. కానీ, అతడు సరిగ్గా నడవలేక ఇబ్బందిపడ్డాడు. దీనిని గమనించిన స్థానికులు అతడి చేతులు పట్టుకుని నెమ్మదిగా షాప్‌లో కూర్చోబెట్టారు. అయితే, ఈ వీడియో ఇప్పటిదా? పాతదా అనే దానిపై స్పష్టత లేదు. వినోద్ కాంబ్లీ కొన్నేళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. ఆర్థికంగానూ పరిస్థితి అంతంతమాత్రంగానే ఉంది. బీసీసీఐ ఇచ్చే పింఛనుతోనే జీవితాన్ని నెట్టుకొస్తున్నట్లు కాంబ్లీ గతంలో పేర్కొన్నాడు. వినోద్ కాంబ్లీ ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో అతడి అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారత మాజీ క్రికెటర్ సచిన్ తెందూల్కర్ తన మిత్రుడు అయిన కాంబ్లీకి సహాయం చేయాలని కోరుతున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. సచిన్, కాంబ్లీ మంచి స్నేహితులు. 1988లో పాఠశాల స్థాయి క్రికెట్లో సచిన్-కాంబ్లీ జోడీ సృష్టించిన ప్రభంజనం ఇప్పటికీ యువ క్రికెటర్లకు స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. హారిస్ షీల్డ్ సెమీఫైనల్ మ్యాచ్‌లో వీరిద్దరూ కలిసి 664 పరుగుల భాగస్వామ్యం నిర్మించారు. అందులో కాంబ్లి 349, సచిన్ 326 పరుగులు చేశారు. 1990ల్లో అంతర్జాతీయ క్రికెట్లోనూ కాంబ్లీ ఆరంభంలో ఓ వెలుగు వెలిగాడు. అయితే ఫామ్ కోల్పోయి, వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేక కెరీర్‌ను ముగించాల్సి వచ్చింది. మరోవైపు సచిన్ పలు రికార్డులను సృష్టించి మరీ ఉన్నత శిఖరాలకు చేరుకుని రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.