తెలంగాణవీణ జాతీయం : ప్రకృతి ప్రకోపంతో కేరళలోని వయనాడ్ జిల్లా ఇటీవల అతలాకుతలమైన సంగతి తెలిసిందే. కొండచరియలు విరిగిపడి పలు గ్రామాలు నామరూపాల్లేకుండా శిథిలమయ్యాయి. ఈ నేపథ్యంలోనే ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం వయనాడ్‌లో పర్యటిస్తున్నారు. ఏరియల్ సర్వే నిర్వహించి విలయం తీవ్రతను తెలుసుకున్నారు.ఈ ఉదయం 11 గంటలకు మోదీ కన్నూర్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్, ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రధానికి స్వాగతం పలికారు. అనంతరం వీరంతా వాయుసేన హెలికాప్టర్‌లో వయనాడ్‌కు బయల్దేరారు. ఆ మార్గంలోనే కొండచరియలు విరిగిపడి తీవ్రంగా దెబ్బతిన్న ముండక్కై, చురాల్‌మల తదితర ప్రాంతాల్లో ప్రధాని విహంగ వీక్షణం చేశారు. ప్రధాని వెంట కేంద్రమంత్రి సురేశ్ గోపి కూడా ఉన్నారు.కాల్‌పెట్టలో హెలికాప్టర్ దిగిన తర్వాత అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కొండచరియలు విరిగిపడిన ప్రాంతాలకు మోదీ చేరుకొని పర్యటించనున్నారు. రెస్క్యూ ఆపరేషన్, బాధితుల తరలింపు జరిగిన తీరును అధికారులు ప్రధానికి వివరించనున్నారు. సహాయక శిబిరాలు, ఆసుపత్రులకు వెళ్లి బాధితులను మోదీ పరామర్శించనున్నారు. అనంతరం అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించనున్నారు.జులై 29-30 తేదీల్లో చోటుచేసుకున్న ఈ ప్రకృతి విపత్తులో కనీసం 226 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు ప్రకటించారు. వందల మంది గాయపడగా వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. మృతుల సంఖ్య 300లకు పైనే ఉంటుందని అనధికారిక వర్గాల సమాచారం. కొండచరియలు విరిగిపడటంతో వందలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. దీంతో అనేక మంది నిరాశ్రయులయ్యారు.