Tuesday, December 24, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

రివ్యూ: డబుల్‌ ఇస్మార్ట్‌.. రామ్‌-పూరి ఖాతాలో హిట్‌ పడిందా?

Must read

తెలంగాణవీణ జాతీయం :ఇస్మార్ట్ శంక‌ర్‌’తో రామ్‌లోని స‌రికొత్త కోణాన్ని ఆవిష్కరించారు దర్శకుడు పూరి జగన్నాథ్‌. ఆ క‌ల‌యిక‌లో కొన‌సాగింపుగా ‘డ‌బుల్ ఇస్మార్ట్‌’ రూపొందింది. సంజ‌య్‌ద‌త్ ఇందులో కీల‌క పాత్ర పోషించ‌డం సినిమాకి మ‌రింత ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. మ‌రి సినిమా ఎలా ఉంది? ప‌రాజ‌యాలతో స‌త‌మ‌త‌మ‌వుతున్న పూరి, రామ్ పోతినేనికి ‘డ‌బుల్ ఇస్మార్ట్’ విజ‌యాన్నిచ్చిందా? (క‌థేంటంటే): బిగ్ బుల్ (సంజ‌య్‌ద‌త్‌) విదేశాల్లో విలాసాల‌తో జీవిస్తూ చీక‌టి సామ్రాజ్యాన్ని న‌డుపుతుంటాడు. భార‌త‌దేశాన్ని ముక్క‌లు చేయాల‌నేది అత‌ని క‌ల. అత‌ని కోసం ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ ‘రా’ వేట కొన‌సాగుతూ ఉంటుంది. ఇంత‌లో బిగ్‌బుల్ మెద‌డులో క‌ణితి ఉంద‌ని, దాని ప్ర‌భావంతో కొన్ని నెల‌లు మాత్ర‌మే బ‌తికే అవ‌కాశం ఉంద‌ని వైద్యులు చెబుతారు. మ‌రో వందేళ్ల ప్ర‌ణాళిక‌ల‌తో బ‌తుకుతున్న బిగ్ బుల్ తాను చ‌నిపోకూడ‌ద‌ని, ఎలాగైనా బ‌త‌కాల‌నుకుంటాడు. అందుకు మార్గాల్ని అన్వేషించినప్పుడు మెద‌డులో చిప్ పెట్టుకుని హైద‌రాబాద్‌లో జీవిస్తున్న ఒకే ఒక్క‌డు ఇస్మార్ట్ శంక‌ర్ (రామ్‌) పేరు తెర‌పైకొస్తుంది. బిగ్ బుల్ మెమొరీస్ అన్నీ కాపీ చేసి, ఇస్మార్ట్ శంక‌ర్ మెద‌డులోని చిప్‌లో పేస్ట్ చేస్తారు. దాంతో శ‌రీరం ఇస్మార్ట్ శంక‌ర్‌ది అయినా, ఆలోచ‌న‌ల‌న్నీ బిగ్ బుల్‌వే కాబ‌ట్టి అత‌నికి మ‌ర‌ణం ఉండ‌ద‌నేది వాళ్ల ప్లాన్‌. మ‌రి ఇస్మార్ట్‌ శంక‌ర్‌లోకి బిగ్ బుల్ ఆలోచ‌న‌లు వ‌చ్చాక ఏం జ‌రిగింది?ఇస్మార్ట్ ఎలాంటి ల‌క్ష్యంతో ఉంటాడు?అత‌ని సొంత జ్ఞాప‌కాలు, అత‌ని ప్రేమ‌, ల‌క్ష్యాలు ఏమ‌య్యాయి? అన్నది చిత్ర కథ. (ఎలా ఉందంటే): ‘ఇస్మార్ట్ శంక‌ర్’ కొన‌సాగింపునకు త‌గ్గ సరకున్న క‌థనే రాసుకున్నాడు పూరి జ‌గ‌న్నాథ్‌. ఒక ల‌క్ష్యంతో ఉన్న క‌థానాయ‌కుడి మెద‌డులోకి మ‌రో వ్య‌క్తి వ‌స్తే ఎలా అనే కాన్‌ఫ్లిక్ట్ తొలి సినిమాకి దీటుగానే అనిపిస్తుంది. మ‌రోవైపు ఇస్మార్ట్ పాత్ర‌కు బ్రాండ్‌గా మారిపోయిన రామ్ ఉండ‌నే ఉన్నాడు. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాల‌ని ఎక్కువ జాగ్ర‌త్త‌ప‌డ్డారో లేక, త‌న పాత సినిమాల్ని గుర్తు చేయాల‌నుకున్నాడో తెలియదు. అర్థవంతంగా లేని అలీ ట్రాక్‌తోనూ.. త‌న శైలి వేగం, ప‌దును లేని క‌థ‌నంతో చాలా చోట్ల స‌న్నివేశాల్ని పూరి జగన్నాథ్‌ సాగదీశాడు. పోశ‌మ్మ క‌థ‌ని ప‌రిచ‌యం చేస్తూ సినిమా మొద‌ల‌వుతుంది. ఆ ఎపిసోడ్‌తోనే హీరో ప్ర‌తీకారం తీర్చుకోవ‌డం కోసం ఎదురు చూస్తున్నాడ‌ని, ఇదొక ప్ర‌తీకార క‌థ అని అర్థ‌మైపోతుంది. తొలి సన్నివేశంలోనే దాదాపుగా క‌థ రివీల్ అయిపోయి, చాలాసేపు అక్క‌డే ఆగిపోతుంది.
తెర‌పై పాత్ర‌లు ప‌రిచ‌యం అవుతుంటాయి, స‌న్నివేశాలు సాగిపోతుంటాయి త‌ప్ప ప్రేక్ష‌కుడికి మాత్రం ఎలాంటి అనుభూతి క‌ల‌గ‌దు. రామ్ పోతినేని త‌న బ్రాండ్ ఇస్మార్ట్ న‌ట‌నతోనూ, హీరోయిన్‌తో క‌లిసి చేసే అల్ల‌రే కాస్త ఉప‌శ‌మ‌నం. మ‌రోవైపు బోకా పాత్ర‌లో అలీ ప‌రిచ‌యం, విచిత్ర‌మైన వేష‌ధార‌ణ కొద్దివ‌ర‌కు హాస్యం పంచినా, ఆ ట్రాక్ సాగుతున్న‌ కొద్దీ ప్రేక్ష‌కుల‌కు చికాకు తెప్పిస్తుంది. ద్వితీయార్ధంలోనైనా మ‌లుపులేమైనా ఉంటాయేమోనని ఎదురు చూస్తే అక్క‌డా నిరాశే. హీరో ఎందుకు ప్ర‌తీకారంతో ర‌గిలిపోతుంటాడో, బిగ్ బుల్ ఇండియా రాక వెన‌క ఎవరున్నారో రివీల్ అయ్యే అంశాలు త‌ప్ప మ‌రేదీ ఆక‌ట్టుకోదు. ద్వంద్వార్థాలతో కూడిన చాలా సంభాష‌ణ‌లు, కొన్ని పాత్ర‌ల హావ‌భావాలు చాలా చోట్ల ఇబ్బంది పెడ‌తాయి. మ‌ద‌ర్ సెంటిమెంట్ ప‌ర్వాలేద‌నిపిస్తుంది. మెమొరీ కాపీ, పేస్ట్ అంటూ క‌థ రాసుకున్న పూరి జ‌గ‌న్నాథ్ త‌న సినిమాల్లోని హీరోల్ని, కొన్నిచోట్ల అప‌రిచితుడు పాత్రని పేస్ట్ చేసి సినిమా తీశాడేమో అనిపిస్తుంది. (ఎవ‌రెలా చేశారంటే): ఇస్మార్ట్ శంక‌ర్ సినిమాలో రామ్‌ని చూసినప్పుడు అత‌ని కోస‌మే పుట్టిన పాత్ర అనిపించింది. మ‌రోసారి ఆ పాత్ర‌పై త‌న ప్ర‌భావం చూపించాడు రామ్‌. హుషారైన మేన‌రిజ‌మ్స్‌, డ్యాన్స్‌, డైలాగ్ డెలివ‌రీతో మ‌రోసారి అద‌రగొట్టాడు. ఈసారి కొన్నిచోట్ల సెంటిమెంట్ కూడా పండించి త‌న పాత్ర‌కి పూర్తి న్యాయం చేశాడు. కావ్య థాప‌ర్ అందంగా క‌నిపించింది. పూరి సినిమా హీరోయిన్ అనిపించుకుంది. డ్యాన్స్‌, యాక్ష‌న్ స‌న్నివేశాల్లోనూ ప్ర‌భావం చూపించింది.
సంజ‌య్‌ద‌త్ పాత్ర గురించి చెప్పుకోవ‌ల్సినంత ఏమీ లేదు. న‌ట‌న ప‌రంగా ఆయ‌న త‌క్కువ చేసిందేమీ లేదు కానీ, ఆ పాత్ర‌లోనే బ‌లం లేదు. పూరి సినిమాల్లో అలీ చేసే ట్రాక్‌లు చాలాసార్లు ఫ‌లితాన్నిచ్చాయి. కానీ ఈ సినిమాలో ఆ ట్రాక్ సాగ‌దీత‌గా అనిపిస్తుంది. మ‌క‌రంద్ దేశ్‌పాండే, గెట‌ప్ శ్రీను, ఝాన్సీ, ప్ర‌గ‌తి త‌దిత‌రులు పాత్ర‌ల ప‌రిధి మేర‌కు న‌టించారు. సాంకేతిక విభాగాల్లో మ‌ణిశ‌ర్మ సంగీతం, జియాని గియాన్నెలి, శ్యామ్ కె.నాయుడు ఛాయాగ్ర‌హ‌ణం మెప్పిస్తాయి. పాట‌ల చిత్రీక‌ర‌ణ, పోరాటాలు కూడా మెప్పించే అంశాలే.

బ‌లాలు

  • రామ్ ఇస్మార్ట్ న‌ట‌న
    బ‌ల‌హీన‌త‌లు
  • ఆస‌క్తి రేకెత్తించ‌ని క‌థ‌నం
  • సాగ‌దీత‌గా స‌న్నివేశాలు
    చివ‌రిగా: పనిచేయని ‘డబుల్‌’ సిమ్‌
    గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you