ఏపీ బ్యూరో : ఏపీలో వెయిటింగ్‌లో ఉన్న ఐపీఎస్‌లకు మెమో జారీ వెనుక సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విచారణకు ఆదేశించిన కేసులను నీరుగార్చేలా కొందరు ఐపీఎస్‌లు కుట్ర చేసినట్లు నిఘా విభాగం గుర్తించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. దీంతో డీజీపీ కార్యాలయం అప్రమత్తమై వెయిటింగ్‌లో ఉన్న 16 మంది ఐపీఎస్‌లకు మెమోలు జారీ చేసింది.తమ పేర్లతో పాటు వైకాపా పెద్దల ప్రమేయాన్ని తక్కువ చేసి చూపేలా దర్యాప్తు చేయాలని ఆయా కేసులపై విచారణ చేస్తున్న అధికారులు, సిబ్బందికి వెయిటింగ్‌లో ఉన్న కొందరు ఐపీఎస్‌లు సూచనలు చేసినట్లు నిఘా విభాగం గుర్తించింది. వివిధ కేసుల్లో జరుగుతున్న అంతర్గత విచారణను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నాలు సాగించినట్లు డీజీపీ కార్యాలయం తేల్చింది. తూతూ మంత్రంగా విచారణ ముగించాలని చెప్పినట్లు వెల్లడైంది. వెయిటింగ్‌లో ఉన్న కొందరు ఐపీఎస్‌ల తీరుతో ప్రభుత్వ పెద్దలు కంగుతిన్నారు. వారిలో కొందరు ఇప్పటికీ వైకాపాకు అనుకూలంగా పనిచేస్తున్నట్లు గుర్తించారు. కేసుల దర్యాప్తునకు ఆటంకం కలిగించే ప్రయత్నాలను కూటమి ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఈ క్రమంలోనే వెయిటింగ్‌లో ఉన్న ఐపీఎస్ అధికారులు రోజూ వచ్చి హెడ్ క్వార్టర్స్‌లో సంతకాలు చేసి వెళ్లాలని డీజీపీ ఆదేశాలు ఇచ్చారు.